కోటి ఆశల రైలు కూత | suspense on today railway budget | Sakshi
Sakshi News home page

కోటి ఆశల రైలు కూత

Jul 8 2014 2:07 AM | Updated on Sep 2 2017 9:57 AM

గత యూపీఏ పాలనలో ప్రతిసారి జిల్లాకు మొండి‘చేయే’ ఎదురైంది. ఇప్పుడు ఎన్డీఏ పాలన వచ్చింది.

ఖమ్మం మామిళ్లగూడెం: గత యూపీఏ పాలనలో ప్రతిసారి జిల్లాకు మొండి‘చేయే’ ఎదురైంది. ఇప్పుడు ఎన్డీఏ పాలన వచ్చింది. ఈ ప్రభుత్వంలోనైనా జిల్లాకు న్యాయం జరుగుతుందా...? అనే ప్రశ్న సర్వత్రా నెలకొంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి రైల్వేబడ్జెట్‌పై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా జిల్లాలో ఉంటున్న రైల్వే సమస్యలుకు ఈ సారైనా పరిష్కారం లభిస్తుందని జిల్లావాసులు ఆశాభావంతో ఉన్నారు.

  ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ప్రతి రైలుకూ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తమిళనాడు, కేరళ ఎక్స్‌ప్రెస్‌లను జిల్లాకేంద్రంలో ఆపాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. వీక్లీ రైళ్ల విషయంలోనూ జిల్లాకు ఇదే అన్యాయం జరుగుతోంది. దీనిపై ఎంతమేరకు న్యాయం జరుగుతుందో చూడాలి. సారథీనగర్- మామిళ్లగూడెం అండర్‌బ్రిడ్జి ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. కమాన్‌బజార్ మధ్యగేటు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ గేటు ఎక్కువసేపు వేసి ఉంటుంది. గేటు కింద నుంచి దూరివెళ్లే క్రమంలో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

  ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఉన్న గూడ్స్ షెడ్‌ను జిల్లాకేంద్రానికి సమీపంలోని పందిళ్లపల్లికి మార్చారు. ఖమ్మంలో ఉన్న షెడ్‌ను పడవేశారు. గూడ్స్ రైళ్లలో సరుకులు నేరుగా ఖమ్మం వస్తాయి. వాటిని లోడింగ్, అన్‌లోడింగ్ చేసే సమయంలో ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరుకుల రవాణాకు మహిళా కళాశాల వైపు ఒక ద్వారం ఉంది. ఆ ఒక్క ద్వారం నుంచే లారీలు వచ్చిపోవడం ఇబ్బందికరంగా మారింది. మరో ద్వారం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మేరకు అధికారులు సర్వే చేశారు. కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు.

  మధ్యగేటు వద్ద ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గతంలో రైల్వే డీసీఎం దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఇక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల వన్‌టౌన్ నుంచి త్రీటౌన్‌లోకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిందని ఫిర్యాదు చేశారు. ఖమ్మం స్టేషన్ మీదుగా రోజుకు దాదాపు 50 వరకు రైళ్లు వచ్చిపోతుంటాయి. కాబట్టి ఎప్పుడూ గేటు వేయక తప్పటం లేదు. దీనివల్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు స్పందించి ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించి ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement