డిఫెన్స్ భూములపై సర్కారు కన్ను | survey for not using lands | Sakshi
Sakshi News home page

డిఫెన్స్ భూములపై సర్కారు కన్ను

Jun 14 2015 2:19 AM | Updated on Sep 3 2017 3:41 AM

డిఫెన్స్ భూములపై సర్కారు కన్ను

డిఫెన్స్ భూములపై సర్కారు కన్ను

రాష్ట్రవ్యాప్తంగా డిఫెన్స్ భూములపై సర్కారు కన్నేసింది...

- వివిధ ప్రాంతాల్లో ఉన్న మిలటరీ భూములపై ఆరా
- వినియోగంలో లేని భూములను సర్వే చేయాలని ఆదేశం
- రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా డిఫెన్స్ భూములపై సర్కారు కన్నేసింది. వివిధ ప్రాంతాల్లోని మిలటరీ విభాగాల ఆధీనంలో.. ఎన్నెన్ని ఎకరాల భూమి ఉందనే అంశంపై ఆరా తీస్తోంది. ప్రత్యేకించి మిలటరీ విభాగాలకు గత ప్రభుత్వాలు కేటాయించిన భూముల్లో ఎంతమేరకు ఆయా విభాగాలు వినియోగించుకోవడం లేదన్న(ఖాళీగా ఉన్న భూములు) అంశంపై సర్కారు దృష్టిపెట్టింది.

దీంతో మిలటరీ భూముల్ని సర్వే చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటికే మిలటరీ భూములు అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. వెనువెంటనే తక్షణం వివరాలు సేకరించాలని కలెక్టర్లు మిలటరీ భూములున్న మండల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. వినియోగంలో లేని భూములను స్వాధీనం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సర్కారు సూచించినట్లు తెలిసింది.

జంట జిల్లాల్లో ఏడువేల ఎకరాలు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు ఏడువేల ఎకరాల ప్రభుత్వ భూమి వివిధ మిలటరీ విభాగాల ఆధీనంలో ఉంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, బాలనగర్, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన భూమి 3,000 ఎకరాలుండగా, హైదరాబాద్ జిల్లాలోని బండ్లగూడ, తిరుమలగిరి, గోల్కొండ, షేక్‌పేట్, మారేడ్‌పల్లి, ఆసిఫ్‌నగర్ మండలాల పరిధిలో సుమారు 3,000 ఎకరాలు మిలట రీ ఆధీనంలో ఉంది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం బలవంతపు(ఎప్పుడైనా, ఎక్కడైనా) భూసేకరణ జరిగే ది. బేగంపేట్, దుండిగల్, హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ఈ చట్టం ప్రకారం తీసుకున్నవే. 1964లో కేం ద్రం తెచ్చిన ‘రిక్విజేషన్ అండ్ ఎక్విజేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాక్ట్’ ప్రకారం వివిధ డిఫెన్స్ ఏజెన్సీలు తమ సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు భూములను ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి.

ఈ చట్టం ప్రకారమే.. గత ప్రభుత్వాలు డీఆర్‌డీఎల్, డీఎంఆర్‌ఎల్, బీడీఎల్, డీఎల్‌ఆర్‌ఎం వంటి డిఫెన్స్ పరిశోధన సంస్థలు, ఆర్టిలరీ, ఎయిర్‌ఫోర్స్.. వంటి మిలటరీ సంస్థలకు పెద్దెత్తున భూములను కేటాయించాయి. రిక్విజేషన్ అండ్ ఎక్విజేషన్ పద్ధతిన ప్రభుత్వం కేటాయించిన భూములకు ప్రతిఏటా లీజు చెల్లించాలి. తమ సంస్థలను విస్తరించుకునేందుకు అవసరమైన మేరకు సొమ్ము చెల్లించి భూసేకరణ చేయించుకోవాలి.  1985 నుంచి ఇప్పటివరకు కొన్ని మిలటరీ సంస్థలు లీజు చెల్లింకపోవడం, తమ సంస్థల విస్తరణను నిలిపివేయడం తాజాగా సర్కారు దృష్టికి వచ్చింది.

ఆ జాగాలను ఖాళీ చేయిస్తారా..
హైదరాబాద్‌కు అవసరమైన హంగు, ఆర్భాటలను నెలకొల్పేందుకు ఎంతో స్థలం అవసరం కానుంది. ఈ నేపథ్యంలోనే.. వినియోగంలో లేని మిలటరీ భూములను స్వాధీనం చేసుకొని, ఆయా జాగాలను రాష్ట్ర అవసరాలకు వినియోగించాలని సర్కారు భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement