వైద్య విద్య ప్రవేశాలపై నిష్పాక్షికంగా వ్యవహరించాలి | Supreme key Comments on go 550 | Sakshi
Sakshi News home page

వైద్య విద్య ప్రవేశాలపై నిష్పాక్షికంగా వ్యవహరించాలి

Aug 24 2018 12:51 AM | Updated on Oct 9 2018 7:05 PM

సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలు నిష్పాక్షికంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. జీవో 550పై తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఇచ్చిన తీర్పు ను సవాలు చేస్తూ 16 మంది విద్యార్థులతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఎన్టీఆర్‌ వర్సిటీ, కాళోజీ వర్సిటీలు పిటిషన్‌ దాఖలు చేశాయి. గురువారం పిటిషన్లను జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల ధర్మాసనం విచారించింది.  

సీటు ఖాళీచేసిన అభ్యర్థిని ఎలా గుర్తిస్తారు?
తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది వికాస్‌సింగ్‌ వాదనలు వినిపించారు. రిజర్వేషన్‌ కలిగిన అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో సీటును వదులుకుని రిజర్వేషన్‌ కోటాలో మెరుగైన సీటు పొందినప్పుడు ఖాళీ చేసిన ఓపెన్‌ కేటగిరీ సీటును కూడా అదే రిజర్వేషన్‌ కేటగిరీకి చెందిన మరో విద్యార్థికి కేటాయించాలని, దీని వల్ల ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు నష్టం వాటిల్లదని వాదించారు. అయితే హైకోర్టు ఈ ప్రక్రియలో రిజర్వేషన్లు 50 శాతం దాటివెళుతున్నాయని భావిస్తూ జీవో 550లోని పేరా 5 (2)ను పక్కనపెట్టిందని, హైకోర్టు ఉత్తర్వులను నిలు పుదల చేయాలని కోరారు. ఈనేపథ్యంలో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా పలు ప్రశ్నలు సంధించారు.

‘ఓపెన్‌ కేటగిరీలోని సీటు ఖాళీ అయినప్పు డు అది తిరిగి ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేసే అవకాశం ఉండగా.. రిజర్వేషన్‌ కలిగిన అభ్యర్థికి కేటాయించడం వల్ల ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారు కదా? రాష్ట్ర ప్రభుత్వంగా మీరు నిష్పాక్షికంగా వ్యవహరించాలి కదా.. ఇక్కడ హైకోర్టు కూడా సరైన తీరులో వ్యవహరించిందని మేం అనడం లేదు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించలేదు.

కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌లో జరుగుతున్నప్పుడు ఒక విద్యార్థి మెరిట్‌ కోటాలో సీటు పొంది.. అంతకంటే మెరుగైన సీటు కోసం రిజర్వేషన్‌ కోటాలో మరో సీటు పొందాలనుకునే ప్రక్రియలో ఖాళీ చేసిన వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేస్తారు’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు న్యాయవాది వికాస్‌ సింగ్, ఏపీ తరఫున బసవ ప్రభు పాటిల్, విద్యార్థుల తరఫు న్యాయవాది రమేష్‌ అల్లంకి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరకు దీనిపై సాంకేతికంగా వివరిస్తామని, కొంత సమయం కావాలని వికాస్‌ సింగ్‌ కోరగా విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement