అల్విదా మేరా దోస్త్‌..

Sudan, the Last Male Northern White Rhino, Is Dead - Sakshi

మరణానికి మరికొన్ని క్షణాలు..  ఓ జాతి అంతరించడానికి మరికొన్ని క్షణాలు..  సూడాన్‌ శాశ్వత నిద్రకు మరికొన్ని క్షణాలు.. రిజర్వు పార్కు రేంజర్‌ ముథాయ్‌ పరుగుపరుగున వచ్చాడు..  మరికొన్ని క్షణాల్లో ఈ లోకాన్ని విడిచివెళ్తున్న తన మిత్రుడికి తుది వీడ్కోలు పలకడానికి..  సూడాన్‌ను చూడగానే ఎప్పుడూ తన మోముపై వికసించే నవ్వు నేడు నేలరాలింది..  రెప్పచాటు ఉప్పెన కట్టలు తెంచుకుంది..అక్కడే అలా కూలబడ్డాడు..సూడాన్‌ను ప్రేమగా నిమిరాడు..చివరిసారిగా...

అల్విదా మేరా దోస్త్‌..
సూడాన్‌.. ప్రపంచంలోనే ఏకైక మగ నార్తర్న్‌ వైట్‌ రైనో(45).. ఒకప్పుడు ఉగాండా, సూడాన్, కాంగో, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లో ఎక్కువగా ఉండేవి. కొమ్ముల కోసం వేటగాళ్లు ఈ ఖడ్గమృగాలను విచ్చలవిడిగా వధించడంతో అంతరించే దశకు చేరాయి. చివరికి మగ నార్తర్న్‌ వైట్‌ రైనోల్లో సూడాన్‌ ఒక్కటే మిగిలింది. ఆ జాతి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడటంతో చెక్‌ రిపబ్లిక్‌లోని జూలో ఉన్న దీన్ని 2009లో కెన్యా ఫారెస్టు రిజర్వ్‌ పార్కుకు తెచ్చారు. సూడాన్‌తోపాటు రెండు ఆడ నార్తర్న్‌ వైట్‌ రైనోలనూ కూడా తెచ్చి.. సంతానోత్పత్తి చేయించేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు సూడాన్‌కు సాయుధ రక్షణను కూడా ఏర్పాటు చేశారు. వాచ్‌ టవర్స్, డ్రోన్లు, వేట కుక్కలు వంటివాటిని పెట్టారు. దీంతో సూడాన్‌ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ అయింది. లక్షల మంది దీన్ని చూడ్డానికి వచ్చేవారు. అయితే, వీటి సంతతిని పెంచడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత తర్వాత సూడాన్‌ ఆరోగ్యం క్షీణించింది. కనీసం లేవలేని పరిస్థితి వచ్చింది. దీని బాధను చూడలేక సూడాన్‌కు కారుణ్య మరణం ప్రసాదించినట్లు మంగళవారం రిజర్వు పార్కు ప్రకటించింది.

ఓ వైద్యుడు ఇంజెక్షన్‌ ద్వారా సూడాన్‌కు విముక్తినిచ్చినట్లు తెలిపింది. అది జరడానికి కొన్ని క్షణాల ముందు.. సూడాన్‌ మృత్యువు ముంగిట ఉన్న సమయంలో తీసిన చిత్రమే ఇది. ప్రకృతి పట్ల, సాటి జీవుల పట్ల మానవుడు చూపుతున్న క్రూర స్వభావానికి నిదర్శనంగా సూడాన్‌ చరిత్రలో నిలిచిపోతుందని రిజర్వు పార్కు సీఈవో రిచర్డ్‌ అన్నారు. ‘కేవలం తన జాతికే కాదు.. మానవుడి అక్రమ కార్యకలాపాల వల్ల అంతరించిపోయే దశలో ఉన్న అనేక వేల జంతు, పక్షి జాతులకు ప్రతినిధిగా వ్యవహరించాడు’అని చెప్పారు. మిగిలినవి రెండూ ఆడ ఖడ్గమృగాలు కావడంతో ఇక ఈ జాతి అంతరించినట్లే అని చెబుతున్నారు. అయితే, శాస్త్రవేత్తలు చనిపోయే ముందు సూడాన్‌ జెనెటిక్‌ మెటీరియల్‌ను సేకరించారని.. ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా ఈ జాతిని రక్షించేందుకు తమ ప్రయత్నాలు సాగుతాయని రిచర్డ్‌ చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top