అప్పులే మిగిలాయ్‌!

Subabul Farmers Demand For Support Price - Sakshi

15వేల ఎకరాల్లో సుబాబుల్‌ సాగు

జిల్లాలో మార్కెటింగ్‌ సౌకర్యమేదీ?

పెట్టుబడులకు అందని సహకారం

చేతులెత్తేస్తున్న ఐటీసీ కంపెనీ

దళారుల చేతుల్లో లావాదేవీలువడ్డీ కట్టలేక ఆగమవుతున్నరైతులు

శాంతినగర్‌ (అలంపూర్‌) : కొన్నేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులు సుబాబుల్‌ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మూడేళ్లక్రితం మార్కెట్‌లో ధరలు బాగా ఉండటం, ఆర్డీఎస్‌ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీరందకపోవడం, ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారుతున్న తరుణంలో రైతులకు సుబాబుల్‌ సాగే దిక్కయింది. అయితే ప్రస్తుతం ధరలు పడిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో 15వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వడ్డేపల్లి మండలంలో గతేడాది హరితహారంలో భాగంగా నాలుగు లక్షల మొక్కలను అధికారులు ఉచితంగా రైతులకు అందజేశారు. ఈ ఏడాది మరో నాలుగు లక్షల మొక్కలు కావాలని రైతులు కోరుతున్నారు. మూడేళ్లపాటు మొక్కలు పెంచడానికి పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి వద్ద అధిక వడ్డీకి డబ్బలు తెచ్చుకుని పంట సాగు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మూడేళ్లలో కోతకు వచ్చేసరికి పెట్టుబడి కంటే వడ్డీ అధిక మవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారుల భోజ్యం
రైతులు పండించిన సుబాబుల్‌ను ము ఖ్యంగా పేపర్‌ తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. పేపర్‌ తయారీ కేంద్రాలు ఐ టీసీ భద్రాచలం, కర్ణాటకలోని డోంగోల్‌లో మాత్రమే ఉన్నాయి. దగ్గర్లో మిల్లులు లేకపోవడం, నేరుగా రైతులతో సుబాబు ల్‌ కొనుగోలు చేయకపోవడం, స్థానికంగా మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడంతో దళారుల రాజ్యం కొనసాగుతోంది. వారు ఎంత చెబితే అంత ధరకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. సుబాబుల్‌ మార్కెట్‌ను దళారులే శాసిస్తున్నారు. కం పెనీకి రైతులకు ఎలాంటి సంబంధం లేకపోవడం వారిపాలిట వరంగా మారింది. రెండేళ్ల క్రితం రూ.3,800 నుంచి రూ. నా లుగు వేల వరకు టన్ను కొనుగోలు చేశా రు. ఈ ఏడాది రూ.2,500కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. మూడేళ్లపాటు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరానికి రూ.50 వేల నష్టం వస్తోందని చెబుతున్నారు. ఎకరా కు 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తోందన్నారు. ఆరు లక్షల టన్నుల దిగుబడిలో టన్నుకు రూ.1,500 చొప్పున మొ త్తం రూ.90 కోట్ల వరకు జిల్లా రైతులు నష్టపోతున్నట్లు సమాచారం. కనీసం రూ.నాలుగు వేలకు టన్ను కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు అవుతుందన్నారు.

మొక్కలే ఉచితంగా ఇస్తాం
ఈజీఎస్‌ ద్వారా సుబాబుల్‌ మొక్కలు మాత్రమే ఉచితంగా ఇస్తాం. వడ్డేపల్లి మండలంలోనే రెండేళ్లలో నాలుగు లక్షల మొక్కలు ఉచితంగా ఇచ్చాం. ఈ ఏడాది ఎక్కువ మొక్కలు కావాలని రైతులు కోరడంతో నాలుగు లక్షల వరకు ఉచితంగా ఇచ్చేందుకు నర్సరీల్లో పెంచుతున్నాం. సుబాబుల్‌కు రాయితీలు, పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.
ఐ.ప్రకాష్, జిల్లా అటవీశాఖ అధికారి, గద్వాల

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
మూడేళ్లపాటు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మిన తరువాత డబ్బులకోసం మూడు నెలలపాటు వేచి ఉండాల్సిన పరిస్తితులు ఉన్నాయి. అసలే గిట్టుబాటు ధరలేక ఓవైపు రైతులు అల్లాడుతుంటే అమ్మిన తరువాత డబ్బులకోసం ఎదురుచూడాల్సిన దుస్తితులు దాపురించాయి. సుబాబుల పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలి.
సత్యప్రసాద్‌రెడ్డి, రైతు, కొంకల, వడ్డేపల్లి మండలం
 

మూడేళ్లపాటు పెట్టుబడికి ఇవ్వాలి
సుబాబుల్‌ పంట కోతకు రావాలంటే మూడేళ్లు పడుతుంది. అప్పటివరకు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. బయట వడ్డీకి డబ్బులు తీసుకుని సాగు చేస్తే మూడేళ్లలో అంతకు అంత రెట్పింపవుతుంది. పంట వల్ల వచ్చే లాభం వడ్డీకే సరిపోతుంది. ఉద్యానవన శాఖ ద్వారా పండ్లతోటలకు ఇచ్చే రాయితీలు మాకు కల్పించాలి.
– ఎస్‌.వెంకటనారాయణరావు, రైతు, శాంతినగర్‌

యార్డు ఏర్పాటు చేయాలి
కిలో విత్తనం రూ.150 ప్రకారం ఐటీసీ పేపర్‌మిల్లు భద్రాచలం నుంచి తెచ్చుకుని 40ఎకరాల్లో పంట సాగు చేశాను. విత్తనాలు ఇవ్వడమేగాని కొనుగోలు చేసేందుకు వారు ముందుకు రావడంలేదు. ఈ ఏడాది టన్నుకు మార్కెట్‌లో రూ.2,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దళారులు ఎంత చెబితే అంత ధరకు అమ్మాల్సి వస్తోంది. జిల్లాలో నేషనల్‌ హైవేకు దగ్గర్లో ఎక్కడైనా యార్డు ఏర్పాటుచేసి నేరుగా ఐటీసీ కంపెనీ ద్వారా కొనుగోలు చేయించాలి.
వి.జోగేంద్రప్రసాద్, రైతు, శాంతినగర్‌

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top