టీచర్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు | Sakshi
Sakshi News home page

టీచర్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

Published Thu, Jul 5 2018 2:03 PM

Students Protest For Teachers - Sakshi

జనగామ: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కిన సంఘటన బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. జనగామ జిల్లా పసరమడ్ల శివారు చంపక్‌హిల్స్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో తరగతులు నిలిచిపోయాయి. 6వ తరగతి నుంచి 10 వరకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల నియామకం లేకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.

ట్రైబల్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులకు మద్దతుగా జనగామ–సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో సిద్దిపేట–జనగామ హైవేపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడిక్కడే నిలిచి పోయాయి.  విషయం తెలుసుకున్న జనగామ సీఐ ముష్క శ్రీనివాస్‌ అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

విద్యార్థి సంఘం నాయకులు మొండికేయడంతో బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా చందునాయక్‌ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 9 తరగతుల విద్యార్థులు 270 మంది ఉన్నారని తెలిపారు. ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేక పోవడంతో ఇప్పటి వరకు పాఠాలు ప్రారంభం కాలేదని తెలిపారు.

దీంతో 68 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయినా అధికారుల పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నలుగురు ఎస్జీటీలతో 3 నుంచి 5వ తరగతి వరకు బోధన కొనసాగిస్తున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి, ఎనిమిది మంది ఉపాధ్యాయుల(సీఆర్టీలు)ను నియమించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడా వినతి పత్రాన్ని కలెక్టరేట్‌ ఏఓ విశ్వప్రసాద్‌కు అందించారు. కార్యక్రమంలో సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement