హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి
సంగారెడ్డి రూరల్: హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాకు చెందిన వీరమల్లి రచన (18) సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలోని ఎంఎన్‌ఆర్ ఫిజయోథెరపీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) మొదటి సంవత్సరం చదువుతోంది. 2016 డిసెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభం కాగా.. సుమారు నెలరోజుల పాటు కాలేజీ హాస్టల్‌లో ఉంది.
అయితే హాస్టల్ వాతావరణం బాగా లేకపోవడంతో ఈ నెల మొదటి వారం నుంచి హైదరాబాద్ బాలానగర్‌లోని తన సోదరి ఇంటి నుంచి కాలేజీకి బస్సులో రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తరగతులకు హాజరై, మధ్యాహ్నం కాలేజీ ఆవరణలో ఉన్న హాస్టల్‌కు స్నేహితురాళ్లతో కలసి వెళ్లింది. నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో కాలేజీ సిబ్బంది మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న రచనను తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం లింగంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రచన మృతిపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.