రాహుల్‌ రాజీనామా వెనుక వ్యూహం: జగ్గారెడ్డి

 strategy behind Rahul Gandhi resignation Says jagga reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేయడం వెనుక వ్యూహం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీని ప్రక్షాళన చేయాలన్న ఆలోచనతోనే రాహుల్‌ ఆ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాజీనామా చేయడమంటే వెనక్కు తగ్గడం కాదని, ఎవరు అధ్యక్షులుగా పనిచేస్తే పార్టీ ఎదుగుతుందనే ఆలోచన ఆయన చేస్తున్నారని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌ పార్టీ మనుగడ సాధ్యం కాదని, అది ఓ కుటుంబం కాదని, వ్యవస్థ అని అన్నారు.

ప్రధాని పదవి చేపట్టే అవకాశం పదేళ్లపాటు ఉన్నా సోనియా, రాహుల్‌లు వద్దనుకున్నారని, వారు ఎప్పుడూ పదవుల కోసం కాకుండా ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేస్తారన్నారు. నెహ్రూ ప్రధాని అయినప్పుడు కూడా ఇందిర ఏ పదవి తీసుకోలేదని, ఇందిర హయాంలో రాజీవ్‌గాంధీ కూడా పదవులు తీసుకోలేదని గుర్తుచేశారు. పార్టీలో సీనియర్లను గౌరవిస్తూనే యువత అవసరమని రాహుల్‌ గుర్తించారని చెప్పారు. యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలలో చురుకుగా పనిచేస్తున్న వారిని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ గుర్తించాలని జగ్గారెడ్డి సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top