3 పంపులతో ఆరంభం!  | Sakshi
Sakshi News home page

3 పంపులతో ఆరంభం! 

Published Sat, Jun 15 2019 1:44 AM

Starting with 3 pumps - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని 3 పంపులతో ఆరంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాణహిత నదిలో వరద ప్రవాహాలు ఇంకా పుంజుకోని నేపథ్యంలో ఈ నెల 21న ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా 3 పంపులను ప్రారంభించి, అనంతరం వరద ప్రవాహాలకు అనుగుణంగా పంపులను ఒక్కొక్కటిగా ఆరంభిస్తూ పోవాలని నిర్ణయించింది. జూలై నుంచి ప్రవాహాలు ఉధృతంగా ఉండే నేపథ్యంలో ఆ నెల 20 నాటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అన్ని పంపులను సిద్ధం చేసి బ్యారేజీలను నింపుతూనే ఆయకట్టుకు నీటి విడుదల చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.  

వరద రాకున్నా పంపింగ్‌కు ఏర్పాట్లు.. 
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటి గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తయింది. పంప్‌హౌస్‌ల్లో మోటార్ల బిగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. అత్యంత ముఖ్యమైనదీ, తొలి పంప్‌హౌస్‌ అయిన మేడిగడ్డలో 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 పంపు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 9 సిద్ధమయ్యాయి. మరో రెండింటినీ వచ్చే నెలలో పూర్తి చేసేలా పనులు కొనసాగిస్తున్నారు. ఒక్కో పంపు గరిష్టంగా 2,118 క్యూసెక్కులు (0.182 టీఎంసీ) నీటిని తోడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని పంపులతో గరిష్టంగా 2 టీఎంసీలని తోడే సామర్థ్యమున్నా, ప్రస్తుతం గోదావరిలో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని 3 మోటార్లను ఆరంభించి నీటి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మేడిగడ్డ వద్ద 100 మీటర్‌ లెవల్‌లో ప్రవాహాలు కొనసాగితే రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది.

మోటార్లను ఆన్‌ చేసి కనీస నీటిని ఎత్తిపోయాలన్నా 93 మీటర్ల మట్టంలో నీరుండాలి. కానీ ప్రస్తుతం రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా ప్రాణహితలో ప్రవాహాలు లేకపోవడంతో గోదావరి వెలవెలబోతోంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 1,500 క్యూసెక్కుల మేర కొనసాగుతున్న నీటి ప్రవాహాలకి క్రాస్‌ బండ్‌ ద్వారా అడ్డుకట్ట వేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం 95 మీటర్ల మట్టం నీరుంది. 21 నాటికి ఈ మట్టం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ లెవల్‌లో ఉన్న నీటితో మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 3 మోటార్లు ఆరంభించి గరిష్టంగా 6 వేల క్యూసెక్కులు (సుమారు అర టీఎంసీ) నీటిని గ్రావిటీ కెనాల్‌కు వదిలే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రావిటీ కెనాల్‌ పనులన్నీ పూర్తయ్యాయి. అడ్డుకట్ట ద్వారా నిలిచే నీటిని వినియోగిస్తూ మేడిగడ్డ పంప్‌హౌజ్‌ నుంచి అన్నారం, సుందిళ్లకు వదిలి అక్కడి మోటార్లను ఒక్కొక్కటిగా ఆరంభించాలని, జూలై నుంచి ప్రవాహాలు పెరుగుతున్న కొద్దీ మోటార్ల సంఖ్యనూ పెంచుతూ పోవాలని భావిస్తున్నారు. 

అన్నారంలో 4.47 టీఎంసీల నిల్వ... 
మేడిగడ్డ నుంచి 8 రోజుల పాటు నీటిని పంపింగ్‌ చేస్తే 10.87 టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నారం పంప్‌హౌజ్‌లో 4.47 టీఎంసీల మేర నిల్వలు చేరతా యి. అప్పుడే ఇక్కడి పంపు మోటార్లను ఆరంభించే అవకాశం ఉంది. అన్నారంలో ఇప్పటికే 8 మోటార్ల లో 5 సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 2 మోటార్లను ఆరంభించి వచ్చే  నెల చివరి నుంచే సుందిళ్ల బ్యా రేజీకి నీటిని పంపింగ్‌ చేయాలని భావిస్తున్నారు. ఇక 8.83 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుందిళ్లలో 4.25 టీఎంసీల నీరుంటేనే అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు సాధ్యపడనుంది.

ఇప్పటికే సుందిళ్లలో 9 మోటార్లలో 6 రెడీ అయ్యాయి. ఇందులోనూ తొలుత 3 మోటార్లతో ఆరంభించి వరద పెరుగుతున్న కొద్దీ మొత్తం మోటార్లను నడపాలని భావిస్తున్నారు. జూలై 20 నాటికి వరద తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున, అప్పటికీ అన్ని మోటార్లను ఆరంభించి నిర్ణీత 2 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీని జూలై చివరికి ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి తరలించి ఆయకట్టుకు నీరివ్వాలని, మరో టీఎంసీ నీటిని మిడ్‌మానేరు నుంచి దిగువ కొండపోచమ్మ సాగర్‌ వరకు తరలించాలని నిర్ణయించారు.  

ప్రొటోకాల్‌ అంశంపై సీఎస్‌ చర్చ.. 
కాగా 21న కాళేశ్వరం పథకం ఆరంభ కార్యక్రమానికి సంబంధించిన ప్రొటోకాల్‌ అంశంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఇరిగేషన్‌ శాఖ సహా ఇతర అధికారులతో సమీక్షించారు. ప్రారంభోత్సవానికి వచ్చే ఆహ్వానితులు, వారి వసతులు, హెలీ ప్యాడ్, ఆహ్వాన పత్రికలు వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు గవర్నర్లు ఈఎస్‌ఎల్‌ నరసింహన్, విద్యాసాగర్‌రావు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర నేతలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రొటోకాల్‌ ఎలా ఉండాలన్న దానిపై పలు నిర్ణయాలు చేసినట్లు సమాచారం.   

Advertisement
 
Advertisement
 
Advertisement