అంతర్గత, అంతర్జాతీయ వలసలు.. అభివృద్ధికి మార్గం కావాలి

special story International Migrants Day - Sakshi

నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ) 18 డిసెంబర్‌ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటివరకు ఫిలిప్పీన్స్, మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేసియా, ఈజిప్టు, లిబియా, సిరియా, టర్కీ లాంటి 49 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించి అమలు చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశం గానీ, గల్ఫ్‌ దేశాలు గానీ ఈ తీర్మానాన్ని 27 ఏళ్లయినా ఆమోదించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిప్పీన్స్, భారత దేశంలో కేరళ రాష్ట్రం అత్యుత్తమ వలస విధానాలతో ప్రవాసులకు పలు సౌకర్యాలు కల్పిన్నాయి.

వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. వలసలకు, అభివృద్ధికి సంబంధం ఉన్నది. మానవ వలస అనేది ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్వస్థలాల నుంచి వేరేచోటికి తరలివెళ్లే వారి సంఖ్య 45.36 కోట్లు. ఇది క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా కోటి 40 లక్షల మంది ఉన్న చోటు వదిలి వేరే చోట్లకు తరలిపోతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. 1979లో అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం వచ్చింది. వేతనాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు మెరుగుపరచడం, శ్రమ దోపిడీని నిరోధించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు.  

అత్యధిక విదేశీ మారకం పొందుతున్న భారత్‌  
ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో మూడు కోట్ల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2015లో ప్రపంచంలోనే అత్యధికంగా 68.91 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశం పొందింది. ఇందులో సగానికి పైగా గల్ఫ్‌ దేశాల నుంచే. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్‌ దేశాల్లో పెట్రోల్‌ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది. ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. తెలంగాణ నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులు తమ కష్టార్జితాన్ని తమ సొంత కుటుంబాలకే పంపుతున్నారు కానీ.. ఆ రూపంలో వాళ్ళు స్వదేశానికి అపారమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న పది లక్షల మంది తెలంగాణ వాసులు నెలకు ఒక వెయ్యి కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని పంపిస్తున్నారు. ఇలా మనదేశానికి పంపిస్తున్న విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ లాంటి ఇంధనాలను కొనుగోలు చేస్తున్నది. కార్మిక శక్తిని ఎగుమతి చేసి, ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 

గల్ఫ్‌లో 85 లక్షల మంది భారతీయులు  
భారతదేశం నుంచి గల్ఫ్‌ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్న రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్‌ ఉన్నాయి. తెలంగాణలోని పాత జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలతోపాటు హైదరాబాద్‌ పాత నగరం నుంచి ఎక్కువగా వలస పోతున్నారు. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సుల్తానేట్‌ అఫ్‌ ఒమన్, బహరేన్, కువైట్, ఖతార్, సింగపూర్‌ మలేసియా తదితర దేశాలకు వెళ్తున్నారు. గల్ఫ్‌తో సహా 18 ఈసీఎన్‌ఆర్‌ (ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వైర్డు) దేశాలలో 85 లక్షల మంది భారతీయులున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన కార్మికులు 10 లక్షల మంది ఉన్నట్లు ఒక అంచనా.            

గల్ఫ్‌ కార్మికులపై ప్రభుత్వాల చిన్నచూపు
కేరళ, పంజాబ్‌ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) తెస్తామన్న తెలంగాణ ప్రభుత్వ హామీ అటకెక్కింది. అమెరికా, యూరప్‌ దేశాలలోని విద్యావంతులైన, ధనవంతులైన ప్రవాస భారతీయులకు తగిన గౌరవం దక్కుతుండగా, గల్ఫ్‌ ఎన్నారైలు వివక్షకు గురవుతున్నారు. గల్ఫ్‌ దేశాలలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. అక్కడ ఏ సంక్షోభం వచ్చినా ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.  

నేరుగా మన పల్లెలపై, ప్రవాసీ కుటుంబాలపై కనిపిస్తున్నది. ఇలాంటి సందర్భాలలో మనవారు ఉద్యోగాలు కోల్పోయి అర్ధంతరంగా ఇంటికి చేరుతున్నారు. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి.. మనవారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ముందస్తు ప్రణాళికలు ఉండవు. ఏజెంట్ల మోసాలు, యజమానుల హింసలు, జీతాలు ఇవ్వకపోవడం, దుర్భర పరిస్థితులలో అక్కడ చిక్కున్నవారిని రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ లేదు. ప్రవాసుల పేర్లను రేషన్‌ కార్డుల్లోంచి తొలగించడం వలన పలు సామాజిక పథకాలకు అర్హత కోల్పోతున్నారు. గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్న మనవారికి న్యాయ సహాయం కావాలి. గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారి కోసం పునరావాసం, పునరేకీకరణ కార్యక్రమాలు చేపట్టాలి.

మంద భీంరెడ్డి గల్ఫ్‌ వలస వ్యవహారాల విశ్లేషకులు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top