
పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్
న్యూయార్క్: జమ్మూకశ్మీర్‌లో లైంగిక హింస జరిగిందంటూ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తిప్ప కొట్టింది. తమ దేశంలో మైనారిటీ మహిళలపై జరుగుతున్న నేరాలపై స్పందించని పాక్. భారత్‌పై మాట్లాడటం సిగ్గుచేటని ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ వ్యాఖ్యానించారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఆ దేశానికే దారుణమైన రికార్డు ఉందని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సంఘర్షణ సంబంధిత లైంగిక హింసపై మంగళవారం జరిగిన బహిరంగ చర్చలో పున్నూస్ మాట్లాడారు.
ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతికత పాకిస్థాన్‌కు లేదని స్పష్టం చేశారు. ‘1971లో పూర్వపు తూర్పు పాకిస్తాన్‌లో లక్షలాది మంది మహిళలపై పాకిస్తాన్ సైన్యం పాల్పడిన లైంగిక హింస నేరాలకు ఎలాంటి శిక్ష వేయకపోవడం సిగ్గు చేటు. ఆ దేశంలో మైనారిటీ వర్గాల్లో మహిళలు, బాలికలు నేటికీ అపహరణకు గురవుతున్నారు. అక్రమ రవాణా జరుగుతోంది. బలవంతపు వివాహాలు, మత మారి్పడులను ఎదుర్కొంటున్నారు. ఈ నేరాలకు పాల్పడేవారు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నట్లు నటించడం విడ్డూరంగా ఉంది. పాక్ ద్వంద్వ వైఖరి, కపటత్వం స్పష్టమవుతున్నాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. ఘర్షణ సంబంధిత లైంగిక హింస, దారుణమైన చర్యలకు పాల్పడేవారిని న్యాయం ముందు నిలబెట్టాలని పున్నూస్ డిమాండ్ చేశారు.
మహిళల రక్షణకు భారత్‌లో ప్రత్యేక వ్యవస్థలు
అంతేకాదు.. మన దేశంలో, ప్రపంచ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన వెల్లడించారు. లైంగిక దోపిడీ, దురి్వనియోగ బాధితుల కోసం యూఎన్ సెక్రటరీ జనరల్ ట్రస్ట్ ఫండ్‌కు విరాళాలు అందించిన మొదటి దేశాల్లో భారతదేశం ఒకటని గుర్తు చేశారు. ఇటువంటి నేరాలను నివారించడానికి యూఎన్‌తో స్వచ్ఛంద ఒప్పందంపై 2017లోనే భారత్ సంతకం చేసిందన్నారు. 2007లో లైబీరియాకు మొదటి పూర్తి మహిళా పోలీసు యూనిట్‌ను మోహరించిందని, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలకు మహిళా బృందాలను పంపుతూనే ఉందని పున్నూస్ ఎత్తి చూపారు. దేశీయంగా మహిళలను రక్షించడానికి భారత్ ప్రత్యేక వ్యవస్థలను సృష్టించిందని పున్నూస్ చెప్పారు. వీటిలో మహిళల భద్రత కోసం 1.2 బిలియన్ డాలర్లను నిర్భయ నిధికి కేటాయించిదని చెప్పారు.
పాక్‌లో 24 వేల మంది కిడ్నాప్..
పాకిస్తాన్‌లో గతేడాది 24 వేలమందికి పైగా కిడ్నాప్‌కు గురయ్యారని సస్టైనబుల్ సోషల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ 2024 నివేదిక వెల్లడించింది. అంతేకాదు 5వేల మందిపై అత్యాచారం, 500 హానర్ కిల్లింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. సింధ్ ప్రావిన్స్‌లోని చాలా మంది హిందూ మైనారిటీ బాలికలకు బలవంతంగా వివాహం చేస్తున్నారని, మత మారి్పడి చేస్తున్నారని పేర్కొంది.