గొర్రెల పథకంలో... ‘భారీ కుంభకోణం’పై విచారణ

Special Investigation On Goats Distribtion Corruption - Sakshi

రంగంలోకి విజిలెన్స్, ఏసీబీ అధికారులు

కొత్త కొత్త అంశాలు వెలుగుచూస్తున్న వైనం

‘గ్రౌండింగ్‌’ కోసం డిప్యూటేషన్లు, సెలవులు

కొందరు అధికారులే కీలకంగా కొనుగోళ్లు

బయటపడుతున్న అక్రమాల బాగోతం

కలకలం రేపుతున్న ‘సాక్షి’ కథనం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గొర్రెల కొనుగోళ్లు, పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేసిన వ్యవహారంపై ‘భారీ కుంభకోణం’ శీర్షికన బుధవారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనం అన్నివర్గాల్లో చర్చకు దారి తీసింది. గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున సాగిన అవినీతి గుట్టు విప్పేందుకు ఓ వైపు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఆరా తీయడం పశుసంవర్ధకశాఖ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని 15 మండలాల్లో కొనసాగుతున్న గొర్రెల పంపిణీ జరుగుతుండగా.. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్న వివరాలు స్పష్టంగా ఉండగా.. ఆ వివరాలను సేకరించిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు గోప్యంగా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరిస్తుండటం కలకలం రేపుతోంది. 

ఓ వైపు విచారణలు, చర్యలు.. మరోవైపు కొనుగోళ్లు..
గొల్లకుర్మలను ఆర్థికపథంలో నడిపిచేందుకు ఉద్దేశించిన గొర్రెల పెంపక పథకం కొందరు పశుసంవర్ధకశాఖ అధికారులు, దళారులకు కాసులు కురిపిస్తోంది. గొర్రెల కొనుగోలు, పంపిణీ పథకంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఓవైపు విచారణ, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుండగా.. మరోవైపు కొనుగోళ్లు కూడా సాగుతున్నాయి. 2017 జూన్‌ 20 ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో ఇప్పటికీ 7,589 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. కడప, పొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల తదితర ప్రాంతాలను నుంచి కొనుగోలు చేశారు. 298 యూనిట్లకు సంబంధించిన గొర్రెలు మాయం కావడంతో పలువురిపై వివిధ ప్రాంతాలో కేసులు నమోదు చేశారు. కరీంనగర్‌ జిల్లా నుంచి వెళ్లి పెద్దపల్లి జిల్లాలో అక్కడి ఓ ఉన్నతాధికారి సహకారంతో చేసిన కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏకంగా ఆ జిల్లా అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఏసీబీకి లేఖ రాశారు. సదరు ఉన్నతాధికారి తన పలుకుబడిని ఉపయోగించి ఆ విచారణ నుంచ్చి తప్పించుకున్నారు.

అదే సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్‌ గొర్రెల కాపరులకు కడప జిల్లాలో కొనుగోలు చేసిన రుద్రంగి పశువుల డాక్టర్‌ మనోహర్‌ జీవాలకు ట్యాగ్‌లు (పోగులు) వేయకుండా పంపిణీ చేశారు. ఇది నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ వద్ద చెక్‌పోస్టులో అధికారుల తనిఖీలు చేయగా.. కొలనూర్‌ గొర్రెలకు ట్యాగ్‌లు వేయలేదని గుర్తించారు. గొర్రెల కొనుగోలు పథకంలో రూపొంధించింన నిబంధనలను రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు పాటించడం లేదని పేర్కొంటూ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ కాంతయ్యసేన, రుద్రంగి డాక్టర్‌ మనోహర్‌ను సస్పెండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లాకు వచ్చే సరికి పోలీసు కేసులతో సరిపెట్టేశారు. దీంతో కొందరు పశువైద్యాధికారులు గొర్రెల పంపిణీ పథకం లాభసాటిగా భావించి డిప్యూటేషన్లు, సెలవులపై వెళ్లి గ్రౌండింగ్‌ చేస్తున్నారు. ఇవే అంశాలు విజిలెన్స్, ఏసీబీ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. 

విచారణలో సరికొత్త అంశాలు...వెలుగుచూస్తున్న పలు ఉదంతాలు
పశుసంవర్ధకశాఖలో కొందరు అధికారుల సహకారంతోనే ఈ బాగోతం సాగుతున్నట్లు అవగతమవుతోంది. గొర్రెల పంపిణీ పథకంపై ఇటీవల ఆ శాఖ జిల్లాస్థాయి అధికారుల సమావేశం జరిగింది. అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్న ఈ సమావేశంలో ‘గొర్రెల కొనుగోళ్లు, పంపిణీ పథకం సంబంధించిన నాపై ఆరోపణలు వచ్చాయి.. విచారణకు ఆదేశించారు.. అయినా నాకేమవుతుంది.. మనకూ ఖర్చులుంటాయి.. తమ్ముళ్లు ఇదంతా ఏమయ్యేది కాదు’ అంటూ ఓ సీనియర్‌ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడానిఘా సంస్థలు సేకరించాయి. అంతేగాకుండా గొర్రెల కొనుగోళ్లపై ఒక్కో యూనిట్‌ (21 గొర్రెలు)కు రూ.6 వేలు కమీషన్‌ తీసుకున్న కొందరు ఇప్పుడా రేటును రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచిన విషయాన్ని కూడా విచారణలో పరిగణనలోకి తీసుకున్నారు.

ఓ పశు వైద్యాధికారి కేవలం ఎక్కువ యూనిట్లున్న ప్రాంతానికి డిప్యూటేషన్‌ వేయించుకోవడం, కేవలం నెల వ్యవధిలో 160 యూనిట్ల వరకు గ్రౌండింగ్‌ చేయడం.. లబ్ధిదారుల వద్ద ఏమేరకు గొర్రెలు ఉన్నాయన్న కోణంలో కూడా అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన ఓ పశు వైద్యాధికారి ఇక్కడ సెలవు పెట్టి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మూడు రోజుల వ్యవధిలో సుమారు 200 యూనిట్లకు చెందిన గొర్రెలను కొనుగోలు చేశారు. ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సమాచారంతో ఈ సంఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఇచ్చిన భరోసాతో కొనుగోళ్లకు వెళ్లిన పశువైద్యాధికారి వ్యవహారం కూడా దీంతో వివాదాస్పదమైంది. పశుసంవర్ధకశాఖలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు దిగిన నిఘా సంస్థలు పలు కోణాల్లో విచారణ చేస్తుండగా.. విచారణ పూర్తయ్యే వరకు వివరాలు వెల్లడించలేమన్న సదరు అధికారులు పేర్లు తెలపడానికి కూడా అంగీకరించలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top