
సోనియా దయతోనే తెలంగాణ: ఎమ్మెస్సార్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దయతోనే తెలంగాణ వచ్చిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు అన్నారు.
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దయతోనే తెలంగాణ వచ్చిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు అన్నారు. ఎమ్మెస్సార్ 83వ పుట్టినరోజు వేడుకలను బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అభిమానులు, కుటుంబసభ్యులు నిర్వహించారు. తన రాజకీయ జీవితం సంతృప్తిగా గడిచిపోయిందని ఎమ్మెస్సార్ అన్నారు. ‘గవర్నర్ కావాలనుకున్నా ఆ కోరిక తీరలేదు. దానిపై పెద్దగా బాధలేదు.
సోనియా పట్టుదలతోనే విభజన సాధ్యమైంది. ముందుచూపుతో వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్‌కే వచ్చేది. కాంగ్రెస్ సరిగా పనిచేయనందువల్లే టీఆర్‌ఎస్‌కు అధికారం దక్కింది. కేసీఆర్ పథకాలు, ఆలోచనలు బాగానే ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, నేతలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మర్రిశశిధర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి నరసింహారెడ్డి, తెలంగాణ జెన్‌కో చైర్మన్ ప్రభాకరరావు, విద్యుత్ బోర్డు మాజీ అధికారి వామనరావు, సీనియర్ జర్నలిస్టులు సి.రాఘవాచారి, సి.హెచ్.రాజేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి తదితరులు ఎమ్మెస్సార్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.