సింగిల్ విండోకి చట్టబద్ధత | single window to be legalised | Sakshi
Sakshi News home page

సింగిల్ విండోకి చట్టబద్ధత

Sep 30 2014 1:33 AM | Updated on Sep 2 2017 2:07 PM

రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేలా సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేలా సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనికి చట్టబద్ధత కూడా కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్స్(టీపీఏఎస్‌ఎస్-టీపాస్) 2014 పేరుతో ప్రత్యేక బిల్లును తీసుకొచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కొత్త పారిశ్రామిక విధానంపై అభిప్రాయాలను తెలుసుకోవడానికి వివిధ పారిశ్రామిక సంఘాలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సమావేశమయ్యారు. వారం రోజుల్లో అభిప్రాయాలను అందిస్తే సాధ్యమైనంత త్వరగా పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి, అసెంబ్లీ సమావేశాల్లో మొదటి బిల్లుగా టీపాస్-2014ను ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని పారిశ్రామిక ప్రతినిధులు తెలిపారు. వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పారిశ్రామిక విధానంలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
 
     సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు ఒకే చోట అన్ని అనుమతులు
     దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అనుమతుల మంజూరు
     కాలపరిమితి దాటితే అధికారులపై చర్యలు, అవసరమైతే జరిమానా విధింపు
     అనుమతులు వచ్చేలోగా సెల్ఫ్ డిక్లరేషన్‌తో పనులు మొదలు పెట్టుకునే వెసులుబాటు
     అధికారులకు జవాబుదారీతనం కల్పించేం దుకు టీపాస్-2014 చట్టం
     ఓపెన్ యాక్సెస్ విధానంలో బయట నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి పరిశ్రమలకు అనుమతి
     వాటర్ గ్రిడ్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా
     {పభుత్వ పారిశ్రామిక పార్కులతో పాటు, ప్రైవేటు పార్కుల ఏర్పాటుకు అనుమతి
     పరిశ్రమల ఏర్పాటుకు తక్షణం అందుబాటులో 3 లక్షల ఎకరాలు
 
 పారిశ్రామిక సంఘాల హర్షం
 
 రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం ముసాయిదా అద్భుతంగా ఉందని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ విధానంతో పారిశ్రామికంగా తెలంగాణ అగ్ర గామిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇది అమల్లోకి వస్తే పారిశ్రామిక పెట్టుబడులకు స్నేహపూర్వక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు దక్కుతుందని సీఐఐ(తెలంగాణ) వైస్ చైర్మన్ నృపేందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలరన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఉన్న ఇలాంటి పాలసీని దేశంలో ఎక్కడా చూడలేదని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్(టీఐఎఫ్) అధ్యక్షుడు కె.సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీఐఐ, టీఐఎఫ్, ఫ్యాప్సీ ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రభుత్వ సలహాదారు పాపారావు, టీజెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్, ఇంధన కార్యదర్శి ఎస్.కె.జోషి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement