డెడ్‌లైన్‌  డిసెంబర్‌ 31

Single Use Plastic Should Ban Within December 31 - Sakshi

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలి 

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే.. 

బల్దియాలకు రీజినల్‌ డైరెక్టర్‌ పంకజం ఆదేశాలు

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర మున్సిపల్‌ శాఖ చీఫ్‌ శ్రీదేవి ఆదేశాలకనుగుణంగా డిసెంబర్‌ 31లోగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో నిషేధించాల న్నారు. ఆ దిశగా మున్సిపల్‌ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ రిజినల్‌ డైరెక్టర్‌(ఆర్‌డీ) పంకజం స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రం సిద్దిపేట మున్సిపల్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపల్‌ కమిషనర్‌లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన సమావేశంలో ఆయా మున్సిపాలిటీల్లో డిసెంబర్‌ చివరి నాటికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. ఇదే సమయంలో ఆయా మున్సిపాలిటీలు డిసెంబర్‌ తరువాత ప్లాస్టిక్‌ను పట్టణంలో నిషేధించినట్లు సెల్ఫ్‌ డిక్లరేషన్‌  ఇవ్వాలన్నారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ నిషేధంపై థార్డ్‌ పార్టీ ద్వారా విచారణ జరిపించి అవార్డులు ఇస్తామని తెలిపారు.  

100 శాతం పన్నులు వసూలు చేయాలి 
మున్సిపాలిటీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లలో అధికారులు లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలన్నారు. సిద్దిపేట మున్సిపల్‌లో ప్రస్తుతం 60శాతం వసూల్లు జరిగాయని, నిర్థేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) పథకాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా దరఖాస్తులను స్వీకరించి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు 

ప్రజల్లో అవగహన కల్పించండి 
జిల్లాలో తడి, పొడి చెత్త సేకరణ విషయంలో ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగహన కల్పించాలని ఆమె సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత గూర్చి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్‌ రహిత పట్టణాలుగా మార్చాలన్నారు. సిద్దిపేట మున్సిపల్‌ అభివృద్ధిలో రోల్‌ మోడల్‌గా ఉందన్నారు. వివిధ అంశాలపై మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ పంకజం మున్సిపల్‌ల వారీగా సమీక్ష నిర్వహిస్తూ వివరాలు సేకరించారు. ఈ సమీక్షలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్‌ల కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, నర్సయ్య, కృష్ణారెడ్డి, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top