హీరో మహేశ్‌బాబు దత్తతతో దశ మారిన సిద్ధాపూర్‌

Siddapur Village Sees Development As Hero Mahesh Babu Adopted The Village - Sakshi

శ్రీమంతుడి సహకారం.. సిద్ధాపూర్‌ సింగారం

కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు

సుందరంగా మారిన పల్లె

సాక్షి, కొత్తూరు: ప్రముఖ సినీహీరో మహేశ్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్‌ ప్రగతి పథంలో దూసుకువెళుతోంది. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మహేశ్‌బాబుకు చెందిన ప్రతినిధులు ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దత్తతకు ముందు ఎవ్వరికీ తెలియని ఈ గ్రామం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితమైంది. మహేశ్‌బాబు శ్రీమంతుడు సినిమా తర్వాత 2015 సెప్టెంబర్‌ 28న సిద్ధాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో ఆయనకు చెందిన పలువురు ప్రముఖులు గ్రామాన్ని సందర్శించి ఇక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విడతల వారీగా పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం గ్రామశివారులో రూ.. 1.50 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో అన్ని వసతులు, సౌకర్యాలతో నిర్మిస్తున్న పాఠశాల భవనం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. 

గ్రామ భౌగోళిక స్వరూపం..
సిద్ధాపూర్‌ గ్రామం జాతీయ రహదారికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామ పంచాయతీకి  చింతగట్టుతండా అనుబంధ గ్రామంగా ఉంది. గ్రామ జనాభా 2,274, ఓటర్లు 1624 మంది ఉండగా 678 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాగా ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి పాడి పరిశ్రమ నిర్వాహణ. గ్రామంలో 70 శాతానికి పైగా ప్రజలు పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 

దత్తతతో సర్వత్రా హర్షాతిరేకాలు

గ్రామంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపులో పాల్గొన్న నమ్రత శిరోద్కర్‌(ఫైల్‌)

గ్రామాన్ని  మహేశ్‌బాబు దత్తత తీసుకోవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన సతీమణి రెండు పర్యాయాలు గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. మహేశ్‌బాబు త్వరలో గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించారు. కాగా మహేష్‌బాబు దత్తత తీసుకున్న తర్వాత గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

  ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు ఇవే..

 •     సిద్ధాపూర్‌తో పాటు పంచాయతీ పరిధిలోని చింతగట్టుతండాలో రూ.6 లక్షలతో రెండుచోట్ల బస్‌షెల్టర్లను ఏర్పాటు చేశారు. 


  రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవనం 
   

 •     గ్రామ సమీపంలో సుమారు రూ. కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పాఠశాల భవనాన్ని అత్యాధునిక సాంకేతికతో           నిర్మిస్తున్నారు.ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు. 
 •     ఇప్పటికే గ్రామంలో రూ.20 లక్షలతో ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. 
 •     గ్రామంలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు వీలుగా  రూ.10.80 లక్షలు వెచ్చించి ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించారు.  
 •     గ్రామంలో చాలా మంది పాడిపరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తుండడంతో పశువైద్యశాల నిర్మించాలని ట్రస్ట్‌ సభ్యులను అభ్యర్థించారు. దీంతో రూ.. 13 లక్షలు వెచ్చించి పశువైద్యశాల భవనాన్ని నిర్మించారు. 
 •     ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం రూ.. 5 లక్షలతో కంఫ్యూటర్‌ ల్యాబ్‌ను సిద్ధం చేశారు. కాగా అది ప్రారంభానికి నోచుకోవాల్సి ఉంది. 
 •     పంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.. 6 లక్షలతో పలుచోట్ల సోలార్‌ లైట్లను ఏర్పాటు చేశారు.

నటుడు మహేశ్‌ బాబు సహకారం మరువలేనిది
మా గ్రామాన్ని దత్తత తీసుకున్న సినీహీరో మహేశ్‌బాబు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆయన సహకారం మరువలేనిది. గ్రామం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుమారు 1.50 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో ట్రస్ట్‌ నిర్మిస్తున్న పాఠశాల భవనం గ్రామానికే ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. 
 – వడ్డె తులసమ్మ, సర్పంచ్, సిద్ధాపూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top