భర్తను చంపి లొంగిపోయిన భార్య | she surrendered after murder of his husband | Sakshi
Sakshi News home page

భర్తను చంపి లొంగిపోయిన భార్య

Nov 16 2014 2:34 AM | Updated on Jul 30 2018 9:16 PM

భర్తను చంపి లొంగిపోయిన భార్య - Sakshi

భర్తను చంపి లొంగిపోయిన భార్య

తనను వేధిస్తున్నాడంటూ భర్తను గొడ్డలితో హతమార్చిన భార్య పోలీసుల ఎదుట లొంగిపోయింది.

మహబూబాబాద్ టౌన్  : తనను వేధిస్తున్నాడంటూ భర్తను గొడ్డలితో హతమార్చిన భార్య పోలీసుల ఎదుట లొంగిపోయింది. మానుకోట టౌన్ సీఐ పింగిలి నరేష్‌రెడ్డి కథనం ప్రకారం... కేసముద్రం మండలం బేరువాడకు చెందిన వాంకుడోత్ పద్మకు తొలుత మానుకోట మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాకు చెందిన భూక్య వెంకన్నతో వివాహమైంది. వారి దాంపత్య జీవితంలో కుమారుడు, కుమార్తె జన్మించారు.

కాగా తన తండ్రితో గొడవపడి భూక్య వెంకన్న కొన్నేళ్ల క్రితం  ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పద్మ తన ఇద్దరు పిల్లలతో మానుకోటకు వచ్చి ఇళ్లలో పని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన మహంకాళి శ్రీనుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడి అనంతారం గుడిలో వివాహం చేసుకున్నారు.

అప్పటి నుంచి శ్రీను ఇంట్లోనే ఉంటున్నారు. పద్మ తన మొదటి భర్తకు పుట్టిన పిల్లలను అత్తగారింట్లో వదిలిపెట్టి వచ్చింది. ఆ తర్వాత శ్రీను, పద్మకు కుమార్తె, కుమారుడు జన్మించారు. కొద్ది నెలలుగా శ్రీను పద్మ మీద అనుమానంతో రోజు తాగొచ్చి కొడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం కూడా శ్రీను తాగొచ్చి పద్మతో గొడవపడ్డాడు.

దీంతో అతడు మంచంలో పడుకుని ఉండగా గొడ్డలితో తల వెనుక బలంగా కొట్టింది. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. శనివారం ఉదయం 10 గంటలకు టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆమె  లొంగిపోవడంతో రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నరేష్‌రెడ్డి తెలిపారు. టౌన్ ఎస్సై వై. సతీష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement