రయ్‌ అనేలా..

Shamshabad Airport Runway development With New technology - Sakshi

అత్యాధునిక పరిజ్ఞానంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో రన్‌వేల పునరుద్ధరణ

ఎయిర్‌పోర్ట్‌ గ్రేడ్‌ స్టీల్‌ గార్డ్‌ టెక్నాలజీ వినియోగం

రెండు మూడు నెలల్లో అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవడంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. రన్‌వేల పునరుద్ధరణకు అమెరికాలో రూపొందించిన అత్యాధునిక ఎయిర్‌పోర్టు గ్రేడ్‌ స్టీల్‌ గార్డ్‌ (ఏజీఎస్‌జీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ టెక్నాలజీతో అతి తక్కువ కాలపరిమితిలో రన్‌వేను తిరిగి వినియోగంలోకి తేవడంతోపాటు.. రన్‌వే జీవిత కాలం కూడా గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే మూడొంతుల వరకు రన్‌వే అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడు నెలల్లో సుమారు 4.5 కి.మీ. పొడవైన రన్‌వే పునరుద్ధరణ పూర్తి కానుంది.

అంతరాయం కలగకుండా..: రన్‌వే పునరుద్ధరణ పనుల వల్ల విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి రోజు 6 గంటలపాటు రన్‌వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలోవచ్చే విమానాలను రెండో రన్‌వే వైపు మళ్లిస్తున్నారు. పనులను పూర్తి చేసిన కొద్ది గంటల్లోనే తిరిగి వినియోగించేందుకు రన్‌వే అందుబాటులోకి వస్తుండటంతో విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. ఏజీఎస్‌జీ టెక్నాలజీతో చేపట్టిన పనులతో రన్‌వే మరో 5 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. 2008లో నిర్మించిన ఈ రన్‌వేను  ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నా.. తొలిసారిగా అమెరికాకు చెందిన ఏజీఎస్‌జీ పరిజ్ఞానంతో చేపట్టిన పునరుద్ధరణ ఎంతో కీలకమైనదని అధికారులు పేర్కొన్నారు.

పూర్తిగా సురక్షితం
అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే విధంగా రన్‌వేను అభివృద్ధి చేస్తున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు, గాలులు వంటి వాతావరణ పరిస్థితుల వల్ల రన్‌వే ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. రన్‌వే వల్ల టైర్లు పేలడం వంటి సంఘటనలకు ఏ మాత్రం అవకాశం ఉండదు. అలాగే తేలికపాటి రసాయన దాడులను కూడా తట్టుకొనే సామర్థ్యం ఉంటుంది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రోజూ 480 జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 50 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1.8 కోట్ల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. 

మరో ముందడుగు..
శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎప్పటికప్పుడు వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. విమానయాన రంగానికి సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఉత్తమ టెక్నాలజీ ఉంటే దాన్ని  ఇక్కడ అమలు చేస్తున్నాం. ఈ క్రమంలో రన్‌వే పునర్నిర్మాణం మరో ముందడుగు – ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిషోర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top