
నాన్నా ప్లీజ్.. నాకో సీటు
పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీలకు తనయుల పోరు మొదలైంది.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ దిగ్గజాలను వారసుల పోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీలకు తనయుల పోరు మొదలైంది. జనరల్ మహిళకు నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవిని రిజర్వు చేయడంతో, మాజీ మేయర్, డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ అసెంబ్లీ సీటుపై కన్నేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలైన డీఎస్ ఈసారి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.
కాగా, ఆయన కుమారుడు నిజామాబాద్ అర్బన్ స్థానం కోసం పట్టుబడుతుండటం గమనార్హం. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా మరో ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉన్నందున.. కామారెడ్డి కాంగ్రెస్ టికెట్ తనకే ఇప్పించాలంటూ ఆయన కుమారుడు మహ్మద్ ఇలియాస్ ఉత్సాహ పడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు..వారి తనయుల పరిస్థితి ఇలా ఉండగా నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలు తండ్రీకొడుకులకు కేటాయిస్తే తన పరిస్థితి ఏమిటన్న సందేహంలో మహిళా కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షురాలు ఆకుల లలిత ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
డీఎస్ మదిలో ఏముందో..?
రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నేతలున్న నిజామాబాద్ జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల నగారా కొత్త వివాదాలకు తెర తీస్తోంది. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో జిల్లాకు చెందిన కీలక నేతలు 2009లో ఓటమి పాలయ్యారు. అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉండటంతో డీఎస్, షబ్బీర్ అలీలు ఇద్దరికీ ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లోనైనా ఎమ్మెల్యేగా గెలుపొందాలన్న లక్ష్యంతో డీఎస్ నిజామాబాద్ అర్బన్ నుంచి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మారాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు.
నిజామాబాద్ రూరల్ నుంచి డీఎస్ బరిలో ఉంటే.. ఆ నియోజకవర్గం (2009లో రద్దయిన డిచ్‌పల్లి నియోజకవర్గం) నుంచి 2008లో గెలిచి.. 2009 ఓటమి చెందిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలితకు నిజామాబాద్ అర్బన్‌లో అవకాశం కల్పిస్తారన్న ప్రచారం ఉంది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ అందాన్ సైతం ఇదే టికెట్ ఆశిస్తున్నారు. నగర పాలకసంస్థ జనరల్ మహిళకు రిజర్వు కావడంతో డీఎస్ కుమారుడు సంజయ్ నిజామాబాద్ అర్బన్ టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతుండటం వివాదస్పదంగా మారనుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి డి.శ్రీనివాస్ తన కుమారున్ని బుజ్జగించి ఇతరులకు అర్బన్ టికెట్ కట్టబెడతారా? లేదంటే మనసు మార్చుకుని మళ్లీ నిజామాబాద్ అర్బన్ నుంచే బరిలోకి దిగుతారా?.. ఆయన రూరల్ నుంచి పోటీచేస్తే అర్బన్‌లో ఎవరికీ అవకాశం దక్కుతుంది? డీఎస్ మనసులో ఏముందనేది కాంగ్రెస్‌వర్గాల్లో తాజా చర్చనీయాంశంగా మారింది.
కొడుకును ఒప్పిస్తారా..?
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహ్మద్ షబ్బీర్ అలీకి సైతం వారసుని పోరు ఈసారి తప్పేట్టు లేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. 1989లో మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందిన షబ్బీర్ అలీ ఆ తర్వాత 1994, 1999లలో టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. 2004లో తిరిగి గెలుపొందిన ఆయన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో పరాజయం పొందిన ఆయనకు పార్టీ అధిష్టానం ఏడాది క్రితం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఆయన ఎమ్మెల్సీగా మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఈ నేపథ్యంలో తాను కామారెడ్డి నుంచి పోటీ చేయలేకుంటే కొడుకు ఇలియాస్‌ను రంగంలో ఉంచుతానని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే, టీపీసీసీలో ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల సభ్యునిగా షబ్బీర్‌కు అవకాశం కలిగింది. దీంతో భవిష్యత్‌లో మైనార్టీ నేతగా మరిన్ని అవకాశాలు రావచ్చని భావించిన ఆయన కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు మహ్మద్ ఇలియాస్ కార్యకర్తలు, యువకులతో కలిసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుండటం.. కామారెడ్డి స్థానం తనకే కేటాయించాలని పట్టుబట్టనుండటంతో షబ్బీర్ అలీ తప్పుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.