హోంగార్డు టెక్నికల్ (ఫోరెన్సిక్ సెన్సైస్) ఉద్యోగానికి ఏడో తరగతి పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని హైదరాబాద్ పోలీస్ విభాగం పేర్కొంది.
హోంగార్డు టెక్నికల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సవరణ
17 నుంచి 19 వరకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: హోంగార్డు టెక్నికల్ (ఫోరెన్సిక్ సెన్సైస్) ఉద్యోగానికి ఏడో తరగతి పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని హైదరాబాద్ పోలీస్ విభాగం పేర్కొంది. ఈ ఉద్యోగాలకు పీజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరించి సోమవారం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏడో తరగతి పూర్తి చేసి, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు http://www.hyderabad police.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను నింపి, ప్రింట్ తీసుకోవాలి. దానితోపాటు విద్యార్హత పత్రాల కాపీలను తీసుకుని ఈనెల 17 నుంచి 19వ తేదీల మధ్య ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య గోషామహల్ స్టేడియానికి రావాలి.
అదేరోజున అక్కడ శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహించి, అర్హత పొందినవారికి వెంటనే నాలెడ్జ్ ఆఫ్ కెమికల్ ల్యాబ్, ఫోరెన్సిక్ టూల్స్ క్వాలిఫైయింగ్ పరీక్షకు హల్‌టికెట్లు జారీచేస్తారు. 22 నుంచి 24వ తేదీ మధ్యలో అథారిటీస్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ ఆ పరీక్షను నిర్వహించనుంది. అందులో ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే.. షార్ట్‌లిస్ట్ చేసేందుకు రాతపరీక్షను నిర్వహిస్తామని హైదరాబాద్ పోలీసు విభాగం తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.