విజిలేస్తే వంద నిమిషాలు  | The Sea Whistle App Runs Strongly In The District. | Sakshi
Sakshi News home page

విజిలేస్తే వంద నిమిషాలు 

Dec 4 2018 12:34 PM | Updated on Dec 4 2018 12:41 PM

 The Sea Whistle App Runs Strongly In The District. - Sakshi

సిద్దిపేట రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సీ–విజిల్‌ యాప్‌పై సేవా కేంద్రం   

సిద్దిపేటజోన్‌: అసెంబ్లీ ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. అందుకు అనుగుణంగానే వినూత్నంగా ప్రత్యేక యాప్‌లను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే సీ విజిల్‌ యాప్‌ జిల్లాలో పటిష్టంగా అమలవుతుంది. యాప్‌ వినియోగంతో అధికారులు ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వంద నిముషాల్లోనే సమస్యను పరిష్కరించే దిశగా ప్రణాళికలు సిద్దం చేసిన అధికారులు ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు.

అధికారుల రికార్డుల ప్రకారం నవంబర్‌ 30 నాటికి సిద్దిపేట జిల్లాలో 20 ఫిర్యాదులు రాగా.. ఆయా నియోజకవర్గాల్లో సీ విజిల్‌ యాప్‌ ద్వారా 54 ఫిర్యాదులు అందాయి. మొత్తంగా చూస్తే యాప్‌ ద్వారా 74 ఫిర్యాదులు రావడం విశేషం. వాటిని సత్వరం పరిశీలించి సమస్యను నిర్ణీత గడువులోగా పరిష్కారం చేయడం పట్ల ఎన్నికల కమిషన్‌ ప్రయోగానికి జిల్లాలో సత్ఫలితాలు వచ్చినట్లుగానే చెప్పవచ్చు.

 
ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యం 
సిద్దిపేట జిల్లాలో డిసెంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సీ విజిల్‌ యాప్‌ను మొదటిసారిగా తెరమీదకు తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సీ విజిల్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఎన్నికలకు సంబంధించి డబ్బు, మద్యంతో పాటు ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఉల్లంఘించే ప్రక్రియలపై నేరుగా యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

సంబంధిత ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తూ సీ విజిల్‌ ద్వారా ఫిర్యాదు చేసిన వంద నిముషాల్లోపే అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు ఫిర్యాదు చేసిన వారికి కూడా సమాచారం అందించాల్సిన బాధ్యతను ఎన్నికల కమిషన్‌ తీసుకుంది. వీటికి సంబంధించిన పర్యవేక్షణ కోసం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో డీసీసీ పేరిట కంట్రోల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. డీసీసీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి సమాచారం అందించి వాటిపై చర్యలకు ఆదేశాలను సైతం డీసీసీ పర్యవేక్షిస్తుంది.  

జిల్లాలో 74 ఫిర్యాదులు.. 
సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో యాప్‌ ద్వారా 74 రకాల ఫిర్యాదులు ఎన్నికల కమిషన్‌కు వచ్చాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్‌లోని డిస్ట్రిక్‌ కంట్రోల్‌ సెంటర్‌కు (డీసీసీ) 20 ఫిర్యాదులు గడిచిన నెలలో రావడం విశేషం. వాటిని జిల్లా ఎన్నిల అధికారి పర్యవేక్షణలో పరిశీలన చేశారు. అదే విధంగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో నాలుగు ఫిర్యాదులు రాగా వాటిలో ప్రధానంగా ప్రభుత్వ స్థలాల్లో, ఆస్తుల్లో పార్టీ జెండాలు కట్టడం, బ్యానర్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటు, నిబంధనలకు విరుద్దంగా ప్రచారం గుర్తులు ఏర్పాటు వంటివి ఉన్నాయి.

వాటిని యాప్‌ ద్వారా స్వీకరించిన అధికారులు వంద నిముషాల్లోనే పరిష్కరించడం విశేషం. మరోవైపు హుస్నాబాద్‌లో 8 ఫిర్యాదులు, గజ్వేల్‌లో అత్యధికంగా 27 ఫిర్యాదులు, సిద్దిపేటలో 15 ఫిర్యాదులు నమోదయ్యాయి. పార్టీ జెండాల ఏర్పాటు, పోస్టర్‌ల ఏర్పాటు, నిబంధనలకు విరుద్దంగా దేవాలయాల వద్ద ఫ్లెక్సీల ఏర్పాటు, వాహనాలపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఎన్నికల అధికారులు నియమనిబంధనల మేరకు పరిశీలన చేసి పరిష్కారం చేశారు. జిల్లాలో సీ విజిల్‌ యాప్‌కు వచ్చిన స్పందన పట్ల అటు అధికారుల్లో, ఇటు ఫిర్యాదుదారులు సంతృప్తిగా ఉన్నారు. దీంతోపాటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుక యాప్‌ దోహద పడుతుందని విద్యావంతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement