వణుకుతున్న ‘వసతి’ 

School Boyes Problems With Cool Climate In Telugu Starts - Sakshi

వీరు జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. రాత్రి 9 గంటల ప్రాంతంలో చలిలోనే పాఠశాల ఆవరణలో పలుచని దుప్పట్లు కప్పుకొని టీవీ చూస్తున్నారు. ప్రభుత్వం ఇంకా బ్లాంకెట్లు ఇవ్వకపోవడంతో ఇళ్ల నుంచి తెచ్చుకున్న దుప్పట్లు, బొంతలు కప్పుకొని కాలం వెల్లదీస్తున్నారు.  

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గత పదిహేను రోజులుగా గజగజ వణికిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక  హాస్టళ్లలో సరైన వసతులు లేక చలికి విద్యార్థులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 8.30 నుంచి 9గంటల మధ్య జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లను ‘సాక్షి’ విజిట్‌ చేయగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి.

ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న విద్యార్థులకు అందించిన దుప్పట్లు పలుచగా ఉండడంతో విద్యార్థులు చలికి తట్టుకోలేకపోతున్నారు. పాఠశాలల ప్రారంభంలోనే ఆయా సంక్షేమశాఖలు విద్యార్థులకు దుప్పట్లు, కార్పేట్లు అందజేయగా.. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో మాత్రం కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఇంకా ఎలాంటి దుప్పట్లు, కార్పెట్లు ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న చిరిగిన బొంతలు, చద్దర్లతోనే వారు కాలం వెల్లదీస్తున్నారు.

సాంఘిక సంక్షేమ ప్రీమెట్రిక్‌ వసతిగృహాల్లో కొత్త అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు కూడా బ్లాంకెట్లు ఇవ్వలేదు. పోస్టుమెట్రిక్‌ వసతిగృహాల్లో కూడా ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థికి బ్లాంకెట్లు అందజేయలేదు. కేవలం కొండ ప్రాంతాల్లో ఉన్న వసతిగృహాల  విద్యార్థులకు మాత్రమే బ్లాంకెట్లు ఇచ్చామని ఐటీడీఏ అధికారి ఒకరు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో సైతం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

ఆయా సంక్షేమశాఖ పరిధిలోని వసతిగృహాల విద్యార్థులకు గతేడాది పంపిణీ చేసిన బ్లాంకెట్లు చిరిగిపోయాయి. అంతేకాకుండా కొంత మంది విద్యార్థులు పాఠశాలలు పునఃప్రారంభంలో బ్లాంకెట్లను ఇంటి వద్దే వదిలేసి రావడంతో ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న పలుచని దుప్పట్లతో చలికి తట్టుకోలేక గజగజ వణికిపోతున్నారు. కొన్ని వసతిగృహల్లోని గదులకు తలుపులు, కిటికీలు కనిపించలేదు. దీంతో గదుల్లోకి చల్లని గాలులు వీస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో అక్కడక్కడ కిటికీలు, దర్వాజలకు తలుపులు కనిపించలేదు. అలాంటి చోట్ల మరమ్మతు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గత వారం రోజుల కిందట సాంఘిక సంక్షేమశాఖ విద్యార్థులకు బ్లాంకెట్లు అందజేశారు.
  
బ్లాంకెట్ల కోసం  ప్రతిపాదనలు తీసుకున్న కలెక్టర్‌ 
గత కొన్ని రోజుల నుంచి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయా సంక్షేమశాఖల పరిధిలోని విద్యార్థులకు కావాల్సిన బ్లాంకెట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అధికారులను ఆదేశించారు. అయితే సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేశారు. త్వరలో బ్లాంకెట్లు లేని విద్యార్థులకు అందజేయనున్నామని ఆయా శాఖల అధికారులు తెలిపారు.  

ఇంటి నుంచి   తెచ్చుకున్న.. 
నేను ఈ విద్యాసంవత్సరం నుంచి హాస్టల్‌ ఉండి చదువుతున్నా. నాకు ఇప్పటి వరకు ఎలాంటి చద్దర్లు, కార్పెట్లు ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న చద్దర్లే కప్పుకుంటున్న. విపరీతమైన చలి ఉండడంతో తట్టుకోలేకపోతున్నా. బ్లాంకెట్లు ఇస్తే బాగుంటుంది. – పవన్‌కల్యాణ్, 9వ తరగతి, కొలాం ఆశ్రమ పాఠశాల, ఆదిలాబాద్‌ 

ఇంకా ఇవ్వలేదు 
గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రంగా ఉంది. నేను ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న చద్దర్లతో చలి నుంచి తట్టుకోలేకపోతున్న. బ్లాంకెట్లు లేకపోవడంతో నా వద్ద ఉన్న చద్దర్లు కప్పుకున్నా చలి నుంచి రక్షణ పొందలేక నిద్ర కూడా పట్టడం లేదు. నూలు బ్లాంకెట్లు ఇస్తే బాగుంటుంది.  – శివరాజ్, 8వ తరగతి, కొలాం ఆశ్రమ పాఠశాల, ఆదిలాబాద్‌ 

త్వరలో అందజేస్తాం  
జిల్లాలోని తమ శాఖ పరిధిలోని సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు చలిని దృష్టిలో ఉంచుకొని బ్లాంకెట్లు ఎన్ని అవసరమని అడిగారు. వాటికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు అందజేశాం. కలెక్టర్‌ కృషల్‌ బ్యాలెన్స్‌ ఫండ్‌ (సీబీఎఫ్‌) కింద బ్లాంకెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. విద్యార్థులకు త్వరలోనే బ్లాంకెట్లు అందజేస్తాం.  – జి.ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధిశాఖ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top