నల్ల సూర్యులకు నిరాశే! | SCCL Employees Upset About Income Tax | Sakshi
Sakshi News home page

నల్ల సూర్యులకు నిరాశే!

Jul 6 2019 11:17 AM | Updated on Jul 6 2019 11:18 AM

SCCL Employees Upset About Income Tax  - Sakshi

సాక్షి, గోదావరిఖని(పెద్దపల్లి) : ఇన్‌కంటాక్స్‌ మాఫీ కోసం ఆశగా ఎదురుచూసి సింగరేణి కార్మికులకు ఈసారి బడ్జెట్‌లోనూ నిరాశే ఎదురైంది. భూమి పొరల్లోకి వెళ్లి నల్లబంగారాన్ని వెలికితీస్తూ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులను సరిహద్దు సైనికులతో సమానంగా పరిగణించి ఇన్‌కంటాక్స్‌ రద్దు చేయాలనే డిమాండ్‌ రెండు దశాబ్దాలుగా నెరవేరడంలేదు. 48 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది కార్మికులు ఇన్‌కంటాక్స్‌ రూపంలో యేటా నెల నుంచి రెండు నెలల వేతనం కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా బొగ్గు గనుల్లోకి వెళ్లి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న నల్లసూరీలకు ఇన్‌కంటాక్స్‌ మాఫీ లేకపోవడంతో అసంతృప్తికి గురవుతున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ అభ్యర్థుల సింగరేణి ప్రాంతంలో జరిగిన ప్రచారంలో కార్మికులకు ఇన్‌కంటాక్స్‌ రద్దుపై హామీ ఇచ్చారు. ఈక్రమంలో ఈసారైన కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులపై కనికరం చూపుతుందని భావించారు. పార్లమెంట్‌లో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో బొగ్గుగని కార్మికుల ఊసే ఎత్తకపోవడంతో కార్మికులు నిరాశకు గురయ్యారు. అయితే గతేడాది రూ.3.50 లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని ఈసారి రూ.5 లక్షల వరకు పెంచడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఈపరిమితి  సంస్థలో 20 శాతం మందికి మాత్రమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. 

రూ.5 లక్షలు దాటితే టాక్స్‌.. 
గత ఆర్థిక సంవత్సరంలో ఇన్‌కంటాక్స్‌ మినహాయింపు పరిమితి రూ.3.50 లక్షలకు పెంచారు. రూ.3.50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఇన్‌కంటాక్స్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈసారి బడ్జెట్‌లో ఆ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. రూ.5 లక్షలకన్నా ఒక్కరూపాయి ఎక్కువ ఆదాయం ఉన్నా మొత్తం పన్ను చెల్లించేలా నిర్ణయం ఉంటుందని అంటున్నారు.  

‘ఏడాదంతా కష్టపడి సంపాదించిన జీతంలో ఏటా రెండు నెలలు జీతం ఇన్‌కంటాక్సే కడుతున్న. కష్టపడి పనిచేసినా ఫలితం లేకుండా పోతోంది. ఇన్‌కంటాక్స్‌ రద్దు హామీ.. హామీగానే మిగులుతుంది. ఈసారి బడ్జెట్‌లో అయినా హామీ నెరవేరుస్తారని భావించినం. కనీసం సింగరేణి కార్మికుల కోసం పరిధి పెంచుతారని అనుకున్నం. కానీ మళ్లీ నిరాశే మిగిలింది. ఏటా రూ.2 లక్షల వరకు ఇన్‌కంటాక్స్‌కే చెల్లిస్తున్న’
-వెంకటస్వామి  ఓసీపీ–3 సీనియర్‌ ఈపీ ఆపరేటర్‌

నిరాశే మిగిల్చింది..
ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మాకు నిరాశే మిగిల్చింది. ఇన్‌కంటాక్స్‌ పూర్తిగా రద్దు చేస్తారని ఆశించినా కేంద్రం మొడిచేయే చూపింది. కనీసం సింగరేణి కార్మికులకైనా పన్న పరిమితి పెంచుతారని భావించాం. కేంద్రం నిర్ణయంతో ఏటా రూ.1.50 లక్షలు ఇన్‌కంటాక్స్‌కే చెల్లించాల్సి వస్తోంది. 
– కొంగర రవీందర్, ఈపీ ఆపరేటర్, ఓసీపీ–3, ఆర్జీ–2

కష్టపడిన సొమ్ము టాక్స్‌కే..
కష్టపడిన సొమ్మంతా ఇన్‌కంటాక్స్‌కు చెల్లిస్తున్నాం. యేటా నెలన్నర జీతం ఇన్‌కంటాక్స్‌కే చెల్లించాల్సి వస్తోంది. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సింగరేణి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలి. ప్రకృతికి విరుద్ధంగా పనిచేసే మా విషయంలో సానుకూలంగా ఆలోచించాలి. 
– వెంకట తిరుపతిరెడ్డి, ఈపీ ఆపరేటర్, మేడిపల్లి ఓసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement