నైపుణ్యానికే పట్టం

SC Corporation new scheme  - Sakshi

నైపుణ్యం ఉన్న ఎస్సీ యువతకు నేరుగా రాయితీలు

ఎస్సీ కార్పొరేషన్‌ సరికొత్త పథకం

రూ.1,000 కోట్లతో రాయితీ పంపిణీకి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త. నైపుణ్యం ఉన్న యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించే కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్‌ శ్రీకారం చూడుతోంది. ఈ మేరకు ఆరు కేటగిరీల్లో 81 రకాల ఉపాధి యూనిట్లను గుర్తిస్తూ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. సిఫార్సులకు తావు లేకుండా దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికీ చేయూత ఇవ్వనుంది. ఇందుకు దరఖాస్తుదారుల నైపుణ్యమే కీలకం కానుంది.

ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు మండల స్థాయి కమిటీకి 50 శాతం వాటా ఇస్తూ మిగతా 50 శాతాన్ని నేరుగా కార్పొరేషన్‌ అధికారులే ఎంపిక చేయనున్నారు. సాధారణంగా కార్పొరేషన్‌ రుణాలంటే దరఖాస్తుల అనంతరం వాటి పరిశీలన, బ్యాంకు నుంచి రుణ మంజూరు అంగీకార పత్రం, ఉమ్మడి లబ్ధిదారుల ఎంపికలో అర్హత సాధిస్తేనే రాయితీ దక్కుతుంది. ఈ సంప్రదాయాన్ని ఎస్సీ కార్పొరేషన్‌ సరికొత్తగా మార్పు చేయనుంది. క్షేత్ర స్థాయిలో ఉమ్మడి లబ్ధిదారుల ఎంపికకు ప్రాధాన్యతనిస్తూనే.. నైపుణ్యం ఉన్న యువతకు నేరుగా రాయితీలిచ్చేలా కార్యాచరణ రూపొందించింది.  

సగభాగం మహిళలకు..
ఎస్సీ కార్పొరేషన్‌ అమలు చేయనున్న స్వయం ఉపాధి పథకంలో ఆరు కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందులో పారిశ్రామిక వ్యాపారం, వ్యవసాయ ఆధారిత యూనిట్లు, చిన్న నీటి పారుదల, పశుసంవర్ధకం/మత్స్య పరిశ్రమ, ఉద్యాన/పట్టు పరిశ్రమలు, వాహన రంగం కేటగిరీల్లో దాదాపు 81 రకాల ఉపాధి యూనిట్లను గుర్తించింది. అభ్యర్థుల విద్యార్హతను పరిగణనలోకి తీసుకుని తగిన యూనిట్లు ఏర్పాటు చేయనుంది.

ఫార్మసీ చేసిన నిరుద్యోగి ఉంటే మెడికల్‌ షాప్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చేస్తే డయాగ్నస్టిక్‌ సెంటర్, డ్రైవింగ్‌ వస్తే క్యాబ్‌ కొనుగోలుకు సహకారం.. ఇలా వినూత్న అంశాలను జోడించింది. యూనిట్‌ ఏర్పాటుకు అయ్యే ఖర్చును బట్టి రూ.80 వేల నుంచి రూ.6 లక్షల వరకు రాయితీలివ్వనుంది. తాజా ప్రణాళికలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సగం యూనిట్లను వారికే కేటాయించనుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 17 వేల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది.

ఈ మేరకు రూ.1,000 కోట్లతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నెలాఖరులోగా ప్రభుత్వం నుంచి ఆమోదం రానున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆమోదం వచ్చిన వెంటనే క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తిస్తామని, అక్టోబర్‌కల్లా యూనిట్లు గ్రౌండింగ్‌ చేసేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top