సేంద్రియ సాగు ఆచరణ సాధ్యమే!

Sakshi Interview With Athuraliye Rathana Thero

‘సాక్షి’తో శ్రీలంక పార్లమెంటు సభ్యుడు అతురలియే రతన తెరో 

రసాయన ఎరువుల వినియోగానికి ఎంఎన్‌సీలే కారణం 

ప్రభుత్వ విధానాల వల్లే ఎరువులపై సబ్సిడీలు 

సరైన ప్రభుత్వ విధానాలుంటేనే సేంద్రియం సాధ్యం 

సాక్షి, హైదరాబాద్‌: ‘సేంద్రియ పద్ధతిలో సుస్థిర సాగు ఆచరణ సాధ్యమనే విషయం మా అనుభవంలో వెల్లడైంది. భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా సన్న, చిన్నకారు రైతులు కూడా సేంద్రియ పద్ధతులు అవలంభించాలి. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేందుకు బహుళజాతి కంపెనీ(ఎంఎన్‌సీ)లు అడ్డుపడుతున్నాయి. ప్రభుత్వపెద్దలు, అధికారుల అవినీతి వల్లే రసాయన ఎరువుల సబ్సిడీ విధానాలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు, బహుళజాతి కంపెనీలకు ఇష్టారీతిన భూసంతర్పణ జరగకుండా సమగ్ర విధానాలు, చట్టాలు అవసరం’అని శ్రీలంక పార్లమెంటు సభ్యుడు అతురలియే రతన తెరో అన్నారు. బౌద్ధ సన్యాసి, వ్యవసాయదారు కూడా అయిన రతన తెరో బుద్ధ జయంతి జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ‘సేంద్రియ వ్యవసాయం’దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై ‘సాక్షి’తో మాట్లాడారు. 

సాక్షి: మీ రెండురోజుల రాష్ట్ర పర్యటనలో గమనించిన అంశాలేమిటి? 
రతన: శ్రీలంక, తెలంగాణ నడుమ చరిత్ర, సంస్కృతి, ఆహారం, వ్యవసాయం, వాతావరణం తదితరాల్లో అనేక సారూప్యతలు ఉన్నాయి. పదేళ్లుగా మార్కెట్‌ ఎకానమీకి అనుగుణంగా శ్రీలంక సాగు విధానాలను మార్చుకుంటోంది. తెలంగాణ కూడా అదే మార్గంలో నడుస్తోంది. 

సాక్షి: వ్యవసాయరంగం పరంగా శ్రీలంకలో ఎలాంటి విధానాలు అమల్లో ఉన్నాయి. 
రతన: 2015 జనవరిలో శ్రీలంకలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన అధ్యక్షుడు సుస్థిర వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారు. వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖల పనితీరును సమీక్షించి అగ్రికల్చర్‌ వేస్టేజ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు, తేయాకు, దాల్చిన చెక్క ఆధారిత ఎగుమతులు, వరి, కూరగాయలు, కొబ్బరి తదితర వ్యవసాయ ఆధారిత అంశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చి, నన్ను సలహాదారుగా నియమించారు.  

సాక్షి: ప్రభుత్వాలు రసాయన ఎరువులపై సబ్సిడీలు ఇస్తున్న నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమేనా? 
రతన: మొదట్లో రసాయన ఎరువులపై సబ్సిడీలు ఎత్తేసి, రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వడం ద్వారా సేంద్రియ ఎరువుల వినియోగం పెరిగేలా ప్రోత్సహించాం. రసాయన ఎరువుల దిగుమతి, పంపిణీలో అవినీతికి అలవాటు పడిన అధికారులు, నేతల ఒత్తిడితో తిరిగి రసాయన ఎరువులపై పాత విధానాలకే ప్రభుత్వం మొగ్గు చూపింది.
 
సాక్షి: ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ విధానంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమేనా? 
రతన: మూడేళ్ల అనుభవంలో సుస్థిర వ్యవసాయం సాధ్యమనే విషయం తేటతెల్లమైంది. తేయాకు, కూరగాయల పంటల సాగులో ఈ విధానం అనుసరించేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ రైతులు కూడా మమ్మలను ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే సరైన ప్రభుత్వ విధానాల ద్వారానే సేంద్రియ వ్యవసాయం సాధ్యమవుతుంది.  

సాక్షి: రైతులను సేంద్రియ సాగు దిశగా మళ్లించడం సాధ్యమవుతుందా? 
రతన: ప్రభుత్వ నిర్ణయాలు స్థిరంగా లేనంతకాలం ఏ రైతు కూడా తనంత తానుగా సేంద్రియ సాగు వైపు మారలేడు. రసాయన ఎరువుల వినియోగానికి అలవాటు పడిన రైతులు.. ఎక్కువ దిగుబడి కోణంలోనే చూస్తున్నారు. కానీ పర్యావరణం, మానవ ఆరోగ్యంపై రసాయన ఎరువులు చూపుతున్న దుష్ప్రభావాలను పట్టించుకోవడం లేదు. అనుభవంతో చెప్తున్నాం. సేంద్రియ సాగు విధానాలు మాత్రమే అన్ని విధాలుగా శ్రేయస్కరం. 

సాక్షి: ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌పై అవగాహన లేని రైతులు ఉత్పత్తులను విక్రయించడంలో పడుతున్నఇబ్బందులకు పరిష్కారమేంటి? 
రతన: ప్రభుత్వాలు మొదట సమగ్రమైన భూచట్టాలు రూపొందించి, బహుళజాతి కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులకు భూములు కట్టబెట్టకుండా విధానాలు రూపొందించాలి. క్షేత్ర స్థాయిలో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి, వారి వ్యవసాయ ఉత్పత్తులు ‘ఆర్గానిక్‌’వే నంటూ క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top