ప్రభుత్వంతో చర్చలు: ఆర్టీసీ సమ్మె యథాతథం?

 RTC Employees Union meet with Minister Mahender Reddy over Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఆయా కార్మిక సంఘాల నేతలు శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 11వతేదీ నుంచి ఆర్టీసీలో సమ్మె నిర్వహిస్తామంటూ సమ్మె నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమ్మె నోటీస్‌పై రవాణా మంత్రితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీలో ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు, అధికారులతో సంస్థ స్థితిగతుల మీద మంత్రి చర్చించారు.

ఈ సందర్భంగా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంస్థ నష్టాల్లో ఉంది. సమ్మె నిర్ణయంపై పునరాలోచించండి. 97 డిపోలలో కేవలం 11 డిపోలు నష్టాల్లో ఉన్నాయి. ఆర్టీసీకి సుమారు 3 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఏటా ఆర్టీసీకి రూ. 700 కోట్లు నష్టంతో పాటు వడ్డీకి 250 కోట్ల రూపాయలు కడుతున్నారు.  జీతాలు పెంచితే అదనంగా సంస్థ మీద రూ.1400 కోట్ల భారం పడుతుంది. 53 వేల మంది కార్మికులు ప్రయోజనంతో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల ప్రయోజనాలు కూడా ముఖ్యం. సంస్థను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఉన్నారు. కార్మికులను తప్పుడు ఆలోచనలతో సమ్మెకు దించటం సరికాదు. కార్మిక నాయకులు ఎన్నికల కోసం ఆర్టీసీ కార్మికులను, సంస్థను నష్టాల్లోకి నెట్టరాద’ని వ్యాఖ్యానించారు.

సమ్మె వాయిదా లేదు
చర్చల అనంతరం టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె వాయిదా వేయాలని మంత్రి కోరారని తెలిపారు. లాభనష్టాలతో ఆర్టీసీని చూడొద్దని, డైరెక్టర్‌ పోస్టులపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. 11 జరిగే సమ్మెను వాయిదా వేయలేదని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం యూనియన్‌ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమ్మెపై చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఇదే చివరి సమ్మె కావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల పేరుతో తమ సమస్యను పక్కదారి పట్టించొద్దని కోరారు. ముఖ్యమంత్రిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top