26 రోజులు.. రూ. 1,865 కోట్లు

Rs 1865 Crores Collected By Liquor Selling Within 26 Days In Telangana - Sakshi

మే నెలలో మద్యం అమ్మకాల లెక్క ఇది

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తర్వాత తొలి రోజు డిపోల నుంచి రూ.72 కోట్ల విలువైన మద్యం వైన్‌ షాపులకు..

ఎండలు మండినా తగ్గిన బీర్‌ సేల్స్‌... లిక్కర్‌ అమ్మకాలు యథాతథం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తొలి నెలలో మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే జరిగాయి. గత నెల ఆరో తేదీన రాష్ట్రంలో వైన్‌ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వగా... 31 నాటికి (26 రోజుల్లో) రూ.1,864.95 కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రూ.800 కోట్ల విలువైన బీర్లు, రూ. 1,000 కోట్ల విలువైన లిక్కర్‌ అమ్ముడు పోయాయి. కాగా, ఎండలు మండిపోయిన మే నెలలో బీర్ల అమ్మకాలు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. లిక్కర్‌ మాత్రం ఎప్పటిలాగే అమ్ముడుపోవడం గమనార్హం.

తొలిరోజు సగటు కొనసాగింపు 
మే నెల మద్యం అమ్మకాలను పరిశీలిస్తే వైన్‌ షాపులు తెరిచిన మొదటి రోజు మే 6న రూ.72 కోట్ల విలువైన మద్యం లిక్కర్‌ డిపోల నుంచి బయటకు వెళ్ళింది. తొలిరోజు కొనుగోళ్లు ఈ నెలంతా కొనసాగగా, నెల ముగిసే సమయానికి సగటున రోజుకు రూ.71 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి పది రోజుల తర్వాతి కొనుగోళ్లలో పెరుగుదల కనిపించింది. మే 16న రూ.100 కోట్లు, 26న ఈ నెలలోనే అత్యదికంగా రూ.140 కోట్లకు పైగా విలువైన సరుకు డిపోల నుంచి షాపులకు వెళ్ళింది. మే నెలలో అత్యధికంగా ఈ రోజే ఎక్కువ కొనుగోళ్లు జరగడం గమనార్హం. ఇక మే నెల చివరి రోజున రూ. 62 కోట్ల మద్యం అమ్ముడయింది.

బీర్‌.... బేర్‌  
మే నెలలో బీర్‌ ప్రియుల్లో ఉత్సాహం తగ్గిందని అమ్మకాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు లక్ష కేసుల బీర్లు, 1.30 లక్షల కేసుల లిక్కర్‌ అమ్ముడవుతుంది. అదే ఎండాకాలంలో అయితే బీర్ల అమ్మకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మే నెలలో మరీ ఎక్కువగా రోజుకు 1.5లక్షలకు పైగా సగటున 50 లక్షల కేసుల బీర్‌ అమ్ముడుపోతుంది. కానీ ఈ మే నెలలో రోజుకు సగటున అమ్ముడైన బీర్‌ కేసుల సంఖ్య 90 వేలు మాత్రమే. మే నెలలో ఇంత తక్కువ స్థాయిలో బీర్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎక్సైజ్‌ వర్గాలే అంటున్నాయి.

గత నెలలో లిక్కర్‌ డిపోల నుంచి అమ్ముడుపోయిన మద్యం వివరాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top