బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుదాం..!

Round Table Meeting In Hyderabad On BC Reservations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు బుధవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాయి.ఈ సందర్భంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 28న సీఎస్‌కు వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. 29న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లల ముట్టడికి పిలుపునిచ్చినట్లు నేతలు వెల్లడించారు.

గోల్కొండ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బీసీల ఓట్లతో గెలిచి వారికే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జన గణన చేసి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కులసంఘాలు ఎమ్మెల్యేల గెలుపునకు తీర్మానం చేశాయని, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలనే నిలదీయండని అన్నారు. 

ఆర్డినెన్స్‌ ఉపసంహరించుకోవాలి..
బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. రిజర్వేషన్లను తగించి బీసీలను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ గెలవాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చాడా మండిపడ్డారు. రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసని ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రధానిని ఎందుకు కలుస్తున్నారు..
బీసీల రిజర్వేషన్ల సాధన కోసం న్యాయపోరాటంతో పాటు ఉద్యమాలను కూడా ఉదృతం చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీని ఎందకు కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

1200 మంది బీసీలకు అన్యాయం జరిగింది..
బీసీల రిజర్వేషన్లను తగ్గించడంతో 1200 మంది బీసీలు పోటీకి దూరమైయ్యారని టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ పేర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని, జంతర్‌ మంతర్‌ వద్ద ధర్మాకు తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. పార్టీలకతీతంగా బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top