బాన్సువాడలో దొంగల బీభత్సం

బాన్సువాడలో దొంగల బీభత్సం - Sakshi


బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా) :  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాస గృహానికి కూతవేటు దూరంలో, పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న దుకాణాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎప్పుడూ పోలీసు బందోబస్తు మధ్య ఉండే మంత్రి ఇంటికి దగ్గరలోనే ఉన్న రెండు దుకాణాల షట్టర్లను పగులగొట్టి అందులో ఉన్న నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగిలించారు. మంగళవారం అర్థరాత్రి బాన్సువాడ పట్టణంలోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..  పట్టణంలోని పాత బాలకృష్ణకు చెందిన ఫర్టిలైజర్ షాపు, పక్కనే ఉన్న క్లినిక్ షట్టర్లను దొంగలు ధ్వంసం చేశారు. ఫర్టిలైజర్ షాపులో కౌంటర్‌ను ధ్వంసం చేసిన దొంగలు అందులో ఉన్న రూ.45వేల నగదును, విలువైన వస్తువులను, నివాస గృహాలకు సంబంధించిన దస్తావేజులను దొంగిలించారు. అనంతరం పక్కనే ఉన్న క్లినిక్లో చొరబడ్డారు. అక్కడ ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు.



సిసి కెమెరాల్లో దృశ్యాలు



కాగా ఫర్టిలైజర్ షాపులో షట్టర్ వద్ద, లోపల ఉన్న సిసి కెమెరాల్లో దొంగలు చొరబడ్డ దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. షట్టర్‌ను ఐరన్ రాడ్‌తో లేపడం, లోనికి చొరబడి, లోపల ఉన్న కౌంటర్‌ను ధ్వంసం చేయడం అన్ని దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రధాన రోడ్డు కావడంతో రాత్రి వేళ వాహనాల రాకపోకలు ఉంటాయని భావించిన దొంగలు షాపునకు అడ్డంగా ఒక వాహనాన్ని నిలిపి తమ పని కానిచ్చారు. మంగళవారం రాత్రి 1.30 నుంచి, 1.50 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు సిసి కెమెరాల ద్వారా తెలుస్తోంది.



అయితే ఈ సంఘటన జరిగిన అరగంటకే వర్నీ మండల కేంద్రంలోని బట్టల షాపులో, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులో దొంగలు చొరబడి అక్కడా రూ.16వేల వరకు దోచుకెళ్ళారు. చందూర్ గ్రామ శివారులో నివసిస్తున్న శంకర్‌రెడ్డి, పుష్ప దంపతులపై దాడి చేసి వారి వద్ద నుంచి 3 గ్రాముల బంగారం, 20 వేల నగదును దోచుకెళ్ళారు. ఐదు చోట్ల జరిగిన ఈ దొంగతనాలు ఒకేరకంగా ఉండడంతో వీటన్నీటిని ఒకే ముఠా చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాన్సువాడ, వర్నీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.



వరుస దొంగతనాలతో అందోళన



కాగా బాన్సువాడ ప్రాంతంలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజుల క్రితం పాత బాన్సువాడలో సాయిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరుగగా, అంతకుముందు టీచర్స్ కాలనీలోనూ చోరీ జరిగింది. అలాగే ఇస్లాంపూరలో యూసుఫ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. ఇలా వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేసుకుని, దొంగలను పట్టుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చోరీకి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తే, భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చని వారంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top