అడ్డగోలు రోడ్లు!

Road Works Wastage in Hyderabad - Sakshi

కమీషన్ల కోసం కక్కుర్తి

అవసరం లేని చోటరోడ్లు వేసిన వైనం

శివార్లలో ఇష్టారాజ్యంగా పనులు

ఎన్నికల తరుణంలో హడావుడి

కోడ్‌నూ పట్టించుకోని వైనం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పలు ప్రధాన రహదారులు సైతం పరమ అధ్వానంగా ఉండి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ పట్టించుకోని జీహెచ్‌ంఎసీ....అవసరం లేని ప్రాంతాల్లో మాత్రం ఇబ్బడిముబ్బడిగా రోడ్ల పనులు చేస్తోంది. ముఖ్యంగా, శివారు ప్రాంతాల్లో  ఈ పనులెక్కువగా జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై విచ్చలవిడిగా అవసరమున్నా లేకపోయినా రోడ్ల పేరిట నిధులు కుమ్మరిస్తున్నారు. ఒకసారి వేసిన రోడ్లను తిరిగి తవ్వకుండా ఉండేందుకు వరదనీటి కాలువలతోపాటే డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ల పనులన్నీ పూర్తయ్యాకే రోడ్లను వేయాల్సి ఉండగా,  వరదనీటి కాలువల సంగతటుంచి కనీసం తాగునీరు, డ్రైనేజీల పనులు మొదలేకాకున్నా లక్షలాది రూపాయలతో రోడ్ల పనులు చేస్తున్నారు. ఎవరి కమీషన్లు వారికి అందుతుండటంతో అసలక్కడ నిజంగా రోడ్లు వేయాల్సిన అవసరముందా..లేదా అన్నది కూడా పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తున్నారు.

సాధారణంగా ఏదైనా కాలనీలో రోడ్లు వేయాలంటే అక్కడి నివాస స్థలాల్లో దాదాపు 80 శాతం మేర ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాకే, తాగునీరు, డ్రైనేజీల పనులయ్యాక రోడ్లు వేయాలి. కానీ 20 శాతం మేర ఇళ్ల నిర్మాణం కూడా  పూర్తి కానప్పటికీ రోడ్లు వేస్తున్నారు. ఇలా రోడ్లు వేసినా, తర్వాత తాగునీరు, డ్రైనేజీ అవసరాల కోసం ఎలాగూ తవ్వాల్సి వస్తుంది కనుక నాణ్యతను పట్టించుకోకుండా నాసిరకం పనులతో పైపై పూతలతో మమ అనిపిస్తున్నారు. ఈ పనుల్లో ఎవరి కందాల్సిన వాటాలు వారికి  అందుతుండటంతో ఎలాంటి అభ్యంతరాలు,  ఆటంకాల్లేకుండా పనులు కానించేస్తున్నారు. రోడ్లువేసినా, కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పెరిగాక డ్రైనేజీ, తాగునీటి అవసరాల కోసం ఎలాగూ రోడ్లను తవ్వాల్సి ఉంటుంది కనుక నాణ్యతను పట్టించుకోవడం లేదు. ఆయా అవసరాల కోసం రోడ్లను తవ్వాక, తిరిగి మళ్లీ రోడ్లు వేయాలి కనుక ‘డబుల్‌ ధమాకా’గా కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు  హడావిడిగా పనులు చేస్తున్నారు. ఇందుకు మచ్చుతునక ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ పరిధిలోని హస్తినాపురం డివిజన్‌లోని భూపేష్‌గుప్తానగర్‌ శ్రీరమణ కాలనీ, హనుమాన్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని పనులు. అక్కడ బీటీతోపాటు సీసీ రోడ్ల పనులు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ఎవరూ పట్టించుకోరనే తలంపుతో ఇష్టానుసారం అధికమొత్తాల అంచనాలతో పనులు చేపట్టారనే ఆరోపణలున్నాయి. అధికార  వికేంద్రీకరణ పేరిట ప్రధాన కార్యాలయంలోని అధికారులు జోన్లు, సర్కిళ్లలో జరుగుతున్న పనులను పట్టించుకోకుండా స్థానిక అధికారులకు అధికారాలు కట్టబెట్టారు. పై స్థాయిలో ఆ పనుల్ని కనీసం తనిఖీలు చేస్తున్నవారు సైతం లేకపోవడంతో  స్థానిక అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఇలాంటి పనుల్లో కొన్నింటికి మంత్రుల స్థాయిలోని వారి నుంచి కూడా సిఫార్సులుండటంతో ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని ఆసరా చేసుకొని, ఎన్ని ప్రాంతాల్లో వీలైతే అన్ని ప్రాంతాల్లో రోడ్ల పేరిట నిధులు దుబారా చేస్తున్నారు.నాలుగైదు ఇళ్లు లేని చోట కూడా రోడ్లు వేస్తున్నారు. 

నిబంధనలు తుంగలో..  
ఒకసారి రోడ్డు వేశాక  తిరిగి తవ్వకుండా ఉండేందుకు  డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, తదితర పనులన్నీ పూర్తయ్యాకే రోడ్డు వేయాలి. ఈ  నిబంధనల్ని తుంగలో తొక్కి రోడ్ల  పనులు చేస్తున్నారు. నిజంగా ప్రజలకు అవసరమున్న చోట చేయకుండా అవసరం లేని చోట్ల జరుగుతున్న ఈ పనులు పలు విమర్శలకు తావిస్తున్నాయి. మరోవైపు ఆయా స్థలాల్లో రియల్‌ వ్యాపారం చేసేవారు రోడ్ల సదుపాయం కూడా ఉందని చెప్పి తమ ప్లాట్లకు డిమాండ్‌ పెంచుకునేందుకు రాజకీయ పైరవీలతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

ఎన్నికల కోడ్‌ ఉన్నా..
నగరంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో కొత్తగా ఎలాంటి పనులు చేపట్టడం కానీ, టెండర్లు పూర్తిచేయడం కానీ చేయరాదు. ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్న పనుల్ని మాత్రం పూర్తిచేయవచ్చు. దీన్ని అడ్డుపెట్టుకొని.. హడావుడిగా పనులు చేస్తూ కోడ్‌కు ముందే ప్రారంభమయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  

పరిశీలిస్తాం..
కాలనీలు ఏర్పడకున్నా.. అవసరం లేని ప్రాంతాల్లో రోడ్లు వేస్తుండటాన్ని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌ దృష్టికి తీసుకెళ్లగా, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీరు, డ్రైనేజీలైన్లు వేశాకే రోడ్లు వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top