20 ఏళ్ల రికార్డు బ్రేక్‌!

Rice Production Increased This Year In Telangana - Sakshi

సిరులు కురిపించిన వరి

లక్ష్యానికి మించి ఏకంగా 20 లక్షలమెట్రిక్‌ టన్నుల దిగుబడి 

అర్థగణాంక శాఖ సమావేశంలో దిగుబడిపై వ్యవసాయ శాఖ చర్చ 

ఉత్పాదకతను పెంచిన స్వల్పకాలిక వరి విత్తనాలు

సాక్షి, హైదరాబాద్‌ : ఖరీఫ్‌లో వరి సిరులు కురిపించింది. 20 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసింది. 2018–19 ఖరీఫ్‌ పంటల దిగుబడి, ఉత్పాదకతపై అర్థగణాంక శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ కీలక సమావేశం నిర్వహించింది. అందులో పంటల దిగుబడిపై చర్చ జరిగింది. ఖరీఫ్‌లో ఏకంగా 61 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. 20 ఏళ్లలో ఇంతటి వరి ధాన్యం దిగుబడి ఎప్పుడూ రాలేదని అధికారులు తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వం అధికారికంగా త్వరలో విడుదల చేయనుంది. 2017–18 ఖరీఫ్‌ దిగుబడి కంటే ఏకంగా రెట్టింపు స్థాయిలో ఈ సారి వరి దిగుబడి వచ్చింది. 2017–18 ఖరీఫ్‌లో వరి దిగుబడి 30.42 లక్షల టన్నులే ఉంది.  

పెరిగిన ఉత్పాదకత.. 
2018–19 ఖరీఫ్‌లో వరి అంచనాలకు మించి సాగైంది. వరి విస్తీర్ణం ఏకంగా 107 శాతానికి చేరుకుంది. ఖరీఫ్‌ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 25.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. ఎకరాకు 20 క్వింటాళ్లపైనే దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు. ఉత్పాదకత, దిగుబడికి అనేక కారణాలున్నాయి. గతంలో వరి పొలంలో నిత్యం పూర్తిస్థాయిలో నీరు ఉండేది. కానీ వ్యవసాయ శాఖ సూచించినట్లు రైతులు ఈసారి వరి పొలంలో ఎప్పుడూ నీరు ఉంచకుండా అప్పుడప్పుడు తెరిపినిచ్చారు. దీనివల్ల వరికి పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ అందింది. ఫలితంగా అది గట్టిపడిందని ఓ ఉన్నతాధికారి విశ్లేషించారు. స్వల్పకాలిక వరి విత్తనాలను ప్రత్యేకంగా రైతులకు అందజేశారు. ఇవి ఉత్పాదకతను పెంచాయి. ప్రధానంగా కునారం సన్నాలు, తెలంగాణ సోన విత్తనాలను జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అందజేశారు.

ఏకంగా లక్ష క్వింటాళ్ల విత్తనాలను అందజేశారు. ఇవి దిగుబడిని గణనీయంగా పెంచాయి. సకాలంలో నాట్లు వేయడంతో ఉత్పాదకత పెరిగింది. వేప పూత యూరియా సరఫరా చేయడం వల్ల కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపింది. ఈ సారి పెద్దగా కీటకాల బారిన పడలేదు. విత్తనాలు, ఎరువులు తదితర వాటిని ప్రభుత్వం నుంచి సకాలంలో అందించడం కూడా ఉత్పాదకత, దిగుబడికి ప్రధాన కారణమని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి విశ్లేషించారు. కాగా, మిగిలిన పంటల దిగుబడిపై రెండో అంచనా నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి మొదటి అంచనా నివేదిక ప్రకారం గత ఖరీఫ్‌లో పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 4.03 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, 3.74 లక్షల టన్నులు మాత్రం దిగుబడి వచ్చే అవకాశముంది. గులాబీ పురుగు తదితర కారణాల వల్ల పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయే పరిస్థితి ఉంది. ఆ వివరాలపై ఇంకా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top