చీర నేసేదెప్పుడు.. కట్టేదెప్పుడు? | A year after the CM promised to distribute sarees | Sakshi
Sakshi News home page

చీర నేసేదెప్పుడు.. కట్టేదెప్పుడు?

Sep 5 2025 3:18 AM | Updated on Sep 5 2025 3:18 AM

A year after the CM promised to distribute sarees

లక్ష్యానికి ఆమడదూరంలో ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి  

ఆర్డర్ల లక్ష్యం 4.63 కోట్ల మీటర్లు 

సేకరించిన చీరల బట్ట 1.85 కోట్ల మీటర్లు 

ఇంకా సాంచాలపై 69 లక్షల మీటర్లు 

సూరత్‌ పంపిన చీరల బట్టలో నాణ్యత లోపాలు 

65 లక్షల మందికి చీరల పంపిణీ లక్ష్యం 

చీరల పంపిణీకి సీఎం హామీ ఇచ్చి ఏడాది 

ఇతను కందుకూరి రమేశ్‌. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో పవర్‌లూమ్స్‌ (మరమగ్గాల)పై ఇందిరా మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నాడు. పది సాంచాలపై పది గంటలపాటు పనిచేస్తే.. ఒక్కో మగ్గంపై నిత్యం 50 మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. నెలంతా పనిచేస్తే రమేశ్‌కు రూ.20 వేల వరకు కూలీ వస్తుంది. అదే పాలిస్టర్‌ బట్టను ఉత్పత్తి చేస్తే నెలకు రూ.10 వేలు వస్తాయి. 

ఇందిరా మహిళాశక్తి చీరల బట్టను ప్రభుత్వం ఆర్డర్‌ చేయడంతో కూలీ డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇలా సిరిసిల్లలో 9,600 పవర్‌లూమ్స్‌పై చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. అంటే రోజుకు 4.80 లక్షల మీటర్ల బట్ట ఉత్పత్తి అవుతుంది. ఆరు నెలల కిందట చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తే ఇప్పుడిప్పుడే గాడిలో పడింది. కానీ సెపె్టంబరు నెలాఖరులోగా చీరల ఉత్పత్తి లక్ష్యం నెరవేరే అవకాశం లేదు.

సిరిసిల్ల: ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి లక్ష్యం చేరడం లేదు. ఉత్పత్తి నెమ్మదిగా సాగుతుండటంతో ఇప్పటికే అధికారులు రెండు సార్లు గడువు పొడిగించారు. ప్రస్తుతం పవర్‌లూమ్స్‌ సంఖ్య పెరగడంతో చీరలబట్ట ఉత్పత్తి వేగం పుంజుకుంది. సిరిసిల్లలోని 131 మ్యాక్స్‌ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లతోపాటు కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోనూ చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందించారు. కానీ సిరిసిల్లలో మెజార్టీ పవర్‌లూమ్స్‌ ఉండటంతో ఇక్కడే ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చారు. 

ఫిబ్రవరిలో మొదటిసారి 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా.. రెండో విడతగా ఏప్రిల్‌లోనూ మరో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వమే యారన్‌(నూలు) డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్‌ స్టాక్‌గా ఉంచడానికి రూ.50 కోట్ల కార్పస్‌ నిధిని మంజూరు చేసింది.

సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు నూలును 90 శాతం అరువుపై సరఫరా చేసింది. ఇప్పటి వరకు మ్యాక్స్‌ సంఘాలకు 2,253 మెట్రిక్‌ టన్నుల నూలును సరఫరా చేశారు. ఆ నూలుతో చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ బట్ట ఉత్పత్తి అవుతున్నా.. సిరిసిల్లలో స్లోగా సాగడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. 

నాణ్యత.. నవ్యత సమస్యలు 
సిరిసిల్లలో ఉత్పత్తి అయిన బట్ట నాణ్యతను పరిశీలించి గోదాములో సేకరిస్తున్నారు. కానీ చీరల బట్టకు బార్డర్‌ డిజైన్‌ ఉండటంతో జోట వేసిన తరువాత కినారె దగ్గర మిగిలిన పోగులను, తెగిన పోగులు చీరల ప్రింటింగ్‌ దగ్గర ఇబ్బందిగా మారింది. ఇటీవల సూరత్‌ ప్రాసెసింగ్‌ మిల్లులకు చీరల బట్టను పంపించగా నాణ్యత లోపాలు వెలుగు చూశాయి. తెగిన పోగులు వెంటనే మగ్గంపైనే ఎదురు పోగు కట్టి ఎక్కించాలి. ఈ సమయంలో నేతన్నలు తమ చేతులను శుభ్రంగా ఉంచుకోకపోవడంతో పోగు ఎక్కించినప్పుడు ఆ చుట్టు పక్కన పోగులు నల్లగా అవుతున్నాయి. 

పోగులు ఎక్కించిన తరువాతనే సాంచాలను స్టార్ట్‌ చేయాలి. పోగులు తెగిపోయినా సాంచాను ఆపకుండా ఉత్పతి చేయడంతో చీరల బట్ట నాణ్యత దెబ్బతింటుంది. బట్టపై చాక్‌పీస్, బాల్‌పెన్ను గుర్తులు లేకుండా చూడాలని, ప్రతి బట్ట ముక్క 30 మీటర్లకుపైగా ఉండాలని లేకుంటే రిజెక్టు చేస్తామని స్పష్టం చేశారు. చీరల బట్ట నాణ్యతపై అనేక అంశాలను సూచించారు. ఇలాంటి సమస్యలు ఉండడంతో ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి నిదానంగా సాగుతోంది. 

సిరిసిల్లలో ఇందిరా మహిళా శక్తి చీర ప్రదర్శన 
రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏకరూప చీరలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఏటా మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలను ఇస్తామని ప్రకటించారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా.. ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి చీర ఖరీదు రూ.480గా నిర్ధారించారు. ఈమేరకు నాణ్యమైన నూలును ప్రభుత్వమే సరఫరా చేస్తూ చీరల బట్టను ఉత్పత్తి చేయిస్తోంది. 

ఈమేరకు ఆగస్టు 26న రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్, చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ శైలజారామయ్యర్‌ ఇందిరా మహిళాశక్తి తొలి చీరను ప్రదర్శించారు. పాలపిట్ట కలర్‌లో చీరను డిజైన్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు గడువులు విధించినా చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్రస్తోత్పత్తిదారులు సాధించలేకపోతున్నారు. ఇప్పటికే సరఫరా చేసిన చీరల బట్టకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడం స్లో కావడానికి మరో కారణంగా భావిస్తున్నారు.

సిరిసిల్లలో పవర్‌లూమ్‌ పరిశ్రమ స్వరూపం 
పవర్‌లూమ్స్‌:     26,302 
మ్యాక్స్‌ సంఘాలు:     131
నూలు డిపో ద్వారాసరఫరా అయిన నూలు: 2,253 మెట్రిక్‌ టన్నులు
ప్రస్తుతం మహిళా శక్తి చీరల బట్టను నడుపుతున్న సాంచాలు: 9,600 
ఇప్పటి వరకు పొందిన చీరల బట్ట ఆర్డర్లు: 4.24 కోట్ల మీటర్లు 
ఇప్పటి వరకు సేకరించిన చీరల బట్ట:  1,85,28,754 మీటర్లు 
పవర్‌లూమ్స్‌పై ఉత్పత్తి అవుతున్న బట్ట:  69,66,656 మీటర్లు 
చీరల బట్ట ఇవ్వాల్సిన గడువు:  సెప్టెంబర్ 30 
ప్రభుత్వ ఆర్డర్లతో నేతన్నలకు పని లభించే కాలం:  6 నుంచి 8 నెలలు

ఇటీవల సాంచాల సంఖ్య పెరిగింది 
ఇటీవల చీరల బట్టను ఉత్పత్తి చేసే సాంచాల సంఖ్య పెరిగింది. మొన్నటి వరకు తక్కువ సాంచాలపై చీరల బట్ట ఉత్పత్తి అయ్యేది. బట్ట ఉత్పత్తిలో నాణ్యత సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు క్వాలిటీతో బట్ట ఉత్పత్తి అవుతుంది. మరిన్ని సాంచాలపై చీరల బట్టను ఉత్పత్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బట్ట ఉత్పత్తి లక్ష్యం సాధించిన మ్యాక్స్‌ సంఘాలకు మరిన్ని ఆర్డర్లు ఇచ్చి గడువులోగా లక్ష్యం సాధిస్తాం. – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement