కాంగ్రెస్‌కు ‘ఊరట’

Results of the first panchayat elections - Sakshi

తొలివిడత పంచాయతీ ఫలితాల్లో వెయ్యి మార్కు దాటడంపై పార్టీలో సంతృప్తి

అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీనే ఇచ్చామంటున్న నేతలు

క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఏమీలేదనే అభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌: తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి ఊరట కలిగిం చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పార్టీ ఊహించిన దానికన్నా అదనంగా స్థానాలు గెలుచుకోవడంపై ఆ పార్టీ నేత ల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవలే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రతిపక్షంగా తమకు నామమాత్రపు స్థానాలే వస్తాయని టీపీసీసీ నేతలు ఊహించారు. తమ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లో కొంతమేర ప్రభావం చూపగలుగుతామని, మిగిలిన చోట్ల పెద్దగా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాల్లేవ ని అంచనా వేశారు. కానీ, తొలివిడత ఫలితాలు వెలువడిన అనంతరం వెయ్యికిపైగా పంచాయతీల్లో కాం గ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం, ఇతరులతో కలిస్తే అధికార పార్టీకి అటూ ఇటుగా సర్పంచ్‌లు గెలుపొందడం నేతల్లో ధీమాను పెంచుతోంది.

పార్టీ రహితంగా జరిగే ఎన్నికలే అయినా ప్రత్యక్షంగా పార్టీల ప్రమేయం ఉన్నందున ఈ ఫలి తాలను చూస్తే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ అంత బలహీనంగా ఏమీ లేదని తేలిందని, పార్టీ రాష్ట్ర నాయకత్వం సరైన రీతిలో ముందుకెళితే రానున్న పార్లమెం టు ఎన్నికల్లో సత్తా చాటుతామని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. వాస్తవానికి, అంగ, ఆర్థిక బలాల తో అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభావితం చేస్తుందని, ఎప్పటిలాగే టీఆర్‌ఎస్‌ ఆ పనిలో సఫలీకృతమయిందని, అయినా ప్రజలు కాంగ్రెస్‌పై అభిమానంతో వెయ్యి స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించారని ఆయన అన్నారు. 

మలి రెండు విడతలపై ఆశ
తొలివిడతలో ఆశించిన ఫలితాలు సాధించిన కాం గ్రెస్‌ నేతలు మలి రెండు విడతల పోలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు జిల్లాల్లో మినహా పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో మరింత కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 25, 30 తేదీల్లో మళ్లీ పోలింగ్‌ ఉన్నందున ఎన్నికలు జరిగే గ్రామాలు, మండలాలకు వెళ్లి కేడర్‌తో మమేకం కావాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ జిల్లా నాయకత్వాలను, పార్టీ ఇతర నేతలను ఆదేశించారు.

గెలుపు అవకాశమున్న ఏ స్థానాన్ని వదిలిపెట్టవద్దని, అధికార టీఆర్‌ఎస్‌కు దీటుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన నేతలకు సూచించారు. దీంతో నేతలందరూ గ్రామాల బాట పట్టారు. గ్రామాలు, వార్డు ల వారీగా పార్టీ బూత్‌ కమిటీలతో చర్చలు జరుపుతున్న నేతలు మలి రెండు విడతల్లో తొలి విడతకన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top