‘అధ్యాపకుల’ నిబంధనలకు ఓకే | Replace 1,061 faculties in university | Sakshi
Sakshi News home page

‘అధ్యాపకుల’ నిబంధనలకు ఓకే

Oct 29 2017 2:03 AM | Updated on Oct 29 2017 2:03 AM

Replace 1,061 faculties in university

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీల్లో 1,061 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను నవంబర్‌లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500కు పైగా పోస్టుల్లో మొదటి విడతలో 1,061 పోస్టుల భర్తీకి ఇదివరకే ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో నియామకాల్లో అనుసరించాల్సిన నిబంధనలపై వైస్‌ చాన్స్‌లర్ల కమిటీ అందజేసిన సిఫారసులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో యథాతథంగా ఆమోదించారు.

దీంతో నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అయితే యూనివర్సిటీలు తమ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్ల సమావేశాలను ఏర్పాటు చేసుకొని పోస్టుల భర్తీకి తీర్మానాలు చేయాలని వీసీల కమిటీ సూచించింది. ఈ ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని స్పష్టం చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు.

మరోవైపు వర్సిటీలకు కేటాయించిన పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా, ప్రాధాన్యాల వారీగా ఏయే పోస్టులను భర్తీ చేయాలన్న విషయంలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి త్వరలోనే సమావేశమై తేల్చనున్నాయి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లలో ఆమోదం తీసుకొని పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ప్రస్తుతం కాంట్రాక్టు/ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్న అధ్యాపకులకు ఈ నియామకాల్లో కొంత వెయిటేజీ లభించనుంది.

వారి అకడమిక్‌ రికార్డుకు 10 మార్కులను వర్సిటీలు ఇవ్వనున్నాయి. ఈ నియామకాల వల్ల ప్రస్తుతం కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్న వారిపై ప్రభావం ఉంటుందా? అనే విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి మే నెలాఖరుకల్లా ఈ నియామకాలను పూర్తి చేసి, కొత్త విద్యా సంవత్సరంలో కొత్త అధ్యాపకులు యూనివర్సిటీల్లో పని చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

వచ్చే నెల నుంచే కొత్త వేతనాలు
వర్సిటీల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌ టైం పద్ధతిన పని చేస్తున్న అధ్యాపకుల వేతనాల పెంపునకు వీసీల కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పాపిరెడ్డి వెల్లడించారు. ఒక్కో అధ్యాపకునికి 75 శాతం వేతనం పెరుగుతుందని తెలిపారు. దీనికి అదనంగా ప్రతి ఏటా 3 శాతం వేతనం పెరగనుందని వివరించారు. 2 వేల మందికి పైగా సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. నవంబర్‌ నెల నుంచే వేతనాలు పెరుగుతాయని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement