ఎక్కడి నుంచైనా రేషన్‌

Ration Can be Taken From Anywhere Says CV Anand - Sakshi

వచ్చే నెల 1 నుంచి జిల్లా పరిధిలో

ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చు: సీవీ ఆనంద్‌

మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు

ఈ–పాస్‌తో రూ.578 కోట్లు ఆదా చేశాం  

రేషన్‌ అక్రమాల నియంత్రణకు కఠిన చర్యలు

డీలర్లకు కమీషన్‌ పెంపు సీఎం పరిశీలనలో ఉందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్ ‌: రేషన్‌ సరుకులను కేటాయించిన షాపులో కాకుండా మరే రేషన్‌ దుకాణంలోనైనా తీసుకునే వెసులుబాటును (పోర్టబిలిటీని) వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. గురువారం ఆయన ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఈ–పాస్‌) ప్రాజెక్టుపై హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునేలా పోర్టబులిటీని అమలు చేస్తామని చెప్పారు. ఉదాహరణకు ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఏదైనా రేషన్‌ దుకాణంలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు.

వలస వచ్చే కూలీలు ఎక్కడికి వెళితే అక్కడ రేషన్‌ సరుకులు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డుల కోసం రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సీవీ ఆనంద్‌ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశామని.. త్వరలో మరో 15–20 మందిపైనా నమోదు చేయనున్నామని తెలిపారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంపు వ్యవహారం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 రేషన్‌ షాపులు ఖాళీగా ఉన్నాయని, వాటికి డీలర్ల ఎంపికపై ప్రభుత్వానికి ఫైలు పంపామని, అర్హతలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

ఈ–పాస్‌తో రూ.578 కోట్లు ఆదా
రాష్ట్రంలోని 17 వేల రేషన్‌ షాపుల్లో ఈ–పాస్‌ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని సీవీ ఆనంద్‌ వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు అందజేయడంలో, మిగులు సరుకులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంలో ఈ–పాస్‌ విధానం ఎంతో సహాయపడిందన్నారు. రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా డీలర్ల అక్రమాలకు చెక్‌ పెట్టడంలో ఈ–పాస్‌ విజయవంతమైందని చెప్పారు.

ఈ–పాస్‌కు అనుసంధానం చేసేలా 4 అంగుళాల స్క్రీన్‌ ఉన్న ఆండ్రాయిడ్‌ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చామని.. అందులో ఐరిస్‌ స్కానర్, బరువు తూచే ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ మెషీన్‌తో బ్లూటూత్‌ అనుసంధానం, కార్డు స్వైపింగ్‌ సదుపాయం, ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ, వాయిస్‌ ఓవర్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో లావాదేవీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఈ–పాస్‌ విధానం ప్రారంభించాక ఇప్పటివరకు 2.15 లక్షల టన్నుల బియ్యం మిగిలాయని, రూ.578.90 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఈ నెల నుంచి ఏడాదికి రూ.800 కోట్ల నుండి రూ.850 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కచ్చితంగా రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తామని, ఆ 15 రోజులు రేషన్‌ షాపులకు సెలవు ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులకు రేషన్‌ సమాచారాన్ని ఎస్సెమ్మెస్‌ ద్వారా పంపిస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top