వారి కుటుంబమే బంగారమైంది : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Speech in Gadwal Meeting - Sakshi

ప్రాజెక్టుల్లో వందల కోట్లు దోచుకున్నారు

కేసీఆర్‌ను కావో కమీషన్‌ రావుగా పిలుస్తున్నారు

ఒక్కో తలపై లక్షన్నర భారం మోపారు

గద్వాల సభలో రాహల్‌ గాంధీ

సాక్షి, గద్వాల : నీళ్లు, నిధులు, నియామకాల గురించి కలలుకన్న తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గద్వాలలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం పీఠమెక్కిన కేసీఆర్‌ కేవలం ఆయన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ అన్ని రంగాల్లో ప్రజలను మోసం చేసిందని, మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ. 17 వేలకోట్ల మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ఉందని గుర్తుచేశారు.

సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘పాలమూరు రంగారెడ్డి పథకాన్ని 11 వేల కోట్లతో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజైన్‌ చేసింది. కేసీఆర్‌ రీడిజైన్ చేసి 65 వేలకోట్లకు పెంచారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు. అందుకే కేసీఆర్‌ను కావో కమీషన్‌ రావు అని ప్రజలు పిలుస్తున్నారు. తెలంగాణ ప్రజల ఒక్కో తలపై లక్షన్నర అప్పుభారం మోపారు. కానీ వారి కుటుంబ సభ్యుల ఆస్తులు మాత్రం 400 శాతం పెరిగాయి. అందుకే వారిది బంగారు కుటుంబమైంది. యువకులకు ఉద్యోగాలు లేవు, ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు ఇక బంగారు తెలంగాణ ఎక్కడిది. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారు. కేసీఆర్‌ యువకులకు, రైతులకు క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు.

‘‘ఇళ్లులేని ప్రతీ ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కటిస్తామని గతంలో హామీ ఇచ్చారు. కనీసం రెండువందల ఇళ్లు కూడా కట్టలేదు. ఆయన మాత్రం 300 కోట్లతో పెద్ద కోట కట్టుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఇస్తాం. బడ్జెట్‌లో 20 శాతం నిధులు విద్యకు కేటాయిస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. కేసీఆర్‌ ఒంటరిగా ఉన్నానంటూ కేంద్రంలో మోదీకి అండగా ఉంటున్నారు. టీఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్‌గా మారింది’’ అని వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top