సదువొస్తలేదు..!

Quality Of Education In Government Schools - Sakshi

జిల్లాలో సర్కారు బడిలో సగం మందికి అక్షరాలు రాని వైనం

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై నిర్లక్ష్యం

ప్రతియేడు సర్వేలో చివరి స్థానం మనదే

పర్యవేక్షణ కరువవ్వడంతోనే ఈ దుస్థితి

ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడుల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యార్థుల పరిస్థితిలో ఏమాత్రం వ్యత్యాసం లేకుండాపోయింది. చాలా మంది విద్యార్థులు కనీస అభ్యసన స్థాయిలైన చదవడం, రాయడం చేయలేకపోతున్నారు. చతుర్విద ప్రక్రియల్లో భాగంగా గోడమీద రాతలు కూడా చదవని పరిస్థితి ఉందంటే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరును ఇట్టే అర్థమవుతోంది. సగానికి పైగా విద్యార్థులు అక్షరాలు గుర్తించడంలో వెనుకంజలో ఉన్నారు.

ప్రతియేడాది విద్యార్థుల ప్రగతి మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమం చేపట్టినా అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు శాపంగా మారుతోంది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) ప్రతి సంవత్సరం 3, 5, 8, 10వ తరగతి విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు పరీక్షలు ని ర్వహిస్తున్నారు. ఈ ఫలితాల్లో జిల్లా వెనుకబడే ఉంటోంది. గత మూడు నాలుగేళ్లుగా పదో తరగ తి పరీక్ష ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయిలో కింది నుంచి మొదటి స్థానం మనదే ఉండడం గమనార్హం.

జిల్లాలో..
జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మొత్తం 56,600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గతేడాది నవంబర్‌ మాసంలో జాతీయ మదింపు పరీక్ష(ఎన్‌ఏఎస్‌)లో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేసిన పాఠశాలల్లో పరీక్ష నిర్వహించింది. ఇందులో చాలామందికి చదవడం, రాయడం రావడం లేదని, బోధన విధానం డొల్లతనాన్ని బయటపెట్టింది. విద్యార్థులు చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారని సర్వేలో తేటతెల్లమైంది. ప్రతియేడాది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం కనిపించడంలేదు.

ఈ యేడాది కూడా ఉపాధ్యాయులకు ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా లోపాలు మాత్రం విద్యాశాఖ అధికారులు సవరించలేకపోతున్నారు. ఇందుకు సీసీఈ విధానమే కారణమని కొంతమంది ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అసైన్‌మెంటు ఇవ్వడం, అవగాహన లేని కారణంగా విద్యార్థులు చేయలేకపోతున్నారు. దీనికితోడు కొంతమంది ఉపాధ్యాయులకు కూడా వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. విద్యార్థి తాను పరిసరాలను చూసినేర్చుకోవాలనేది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. లక్ష్యం మంచిదే అయినా ఆచరణలో మాత్రం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

త్వరలో ఉపాధ్యాయులకు శిక్షణ..

ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలపై ఈ పది రోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. షార్ట్‌ టర్మ్, మిడ్‌టర్మ్, లాంగ్‌ టర్మ్‌ వారీగా ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించనున్నారు. ఈ శిక్షణలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులు ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారనే విషయాలను ఉపాధ్యాయులు గ్రహించి వారికి ప్రత్యేక బోధన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఈయేడాదైనా మెరుగు పడేనా..

ప్రతియేడాది నవంబర్‌లో రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిల్లో విద్యార్థుల సామర్థ్య స్థాయి పరీక్షలు నిర్వహిస్తారు. గతేడాది రాష్ట్రస్థాయిలో చివరి స్థానంలో నిలిచిన విషయం విదితమే. ఈసారైనా జిల్లాలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల స్థాయి మెరుగు పడేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేక దృష్టి సారించి ఈసారి ప్రతిభ కనబర్చేలా చూడాలని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా జిల్లాలోని 58 ప్రాథమిక పాఠశాలల్లో 813 మంది 3వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 50.48 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 51.12 శాతం, పరిసరాల విజ్ఞానంలో 48.40 శాతం ప్రగతి ఉంది.

అదేవిధంగా 57 ప్రాథమిక పాఠశాలల్లో 1,074 మంది 5వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 43.02 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 40.95 శాతం, పరిసరాల విజ్ఞానంలో 40.05 శాతం,  8వ తరగతితో 51 ఉన్నత పాఠశాల్లో 1301 విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 43.62 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 31.01 శాతం, సామాన్య శాస్త్రంలో 31.51 శాతం, సాంఘిక శాస్త్రంలో 33.51 శాతం వచ్చాయి. 80 పాఠశాలల్లో 2642 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 46.81 శాతం, ఆంగ్లంలో 33.34 శాతం, గణితంలో 33.23 శాతం, సామాన్య శాస్త్రంలో 33.94 శాతం, సాంఘిక శాస్త్రంలో 36.23 శాతం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ ఫలితాల్లో 10వ తరగతి విద్యార్థులు కేవలం 31 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఇదీ జిల్లా పరిస్థితి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top