దారి దోపిడీ

Private Operators Making Money With RTC Strike - Sakshi

పండగ ప్రయాణంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం

సోమవారం పక్క రాష్ట్రాలకు 1400 బస్సుల రాకపోకలు

గ్రేటర్‌లో తాత్కాలిక సిబ్బందితో 1500 బస్సుల సేవలు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు ఆపరేటర్లు తెరతీసిన దారి దోపిడీ పర్వం సోమవారం కూడా కొనసాగింది. దసరాకు సొంతూళ్లకు బయలుదేరిన వారి నుంచి ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్‌ నిర్వాహకులు వందశాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. యథావిధిగా విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, తిరుపతి ప్రాంతాలకు వెళ్లేవారి నుంచి సాధారణ టికెట్‌ ధరపై రెట్టింపు చార్జీలు వసూలు చేసి జేబులు గుల్ల చేశారు. నగరం నుంచి  తెలంగాణా రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సుమారు 1400 బస్సులు తరిగినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.  

గ్రేటర్‌లో 1500 బస్సులు..  
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 29 ఆర్టీసీ డిపోల్లో మొత్తం 3800 బస్సులకుగాను.. సోమవారం సుమారు 1600 మంది తాత్కాలిక సిబ్బంది సాయంతో 1500 బస్సులు తిప్పారు. వీటిలో 500 వరకు ఆర్టీసీ అద్దె బస్సులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించి ప్రయాణికుల జేబులు గుల్లచేశారు. రూ.10 చార్జీకి రూ.20 వసూలు చేసి జేబులు నింపుకోవడం గమనార్హం. ప్రయాణికులు విధిలేక వారు అడిగినంత సమర్పించుకున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో పలు ఆర్టీసీ డిపోల వద్ద రెగ్యులర్‌ కార్మికులు బతుకమ్మ ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు.  
     ఆటోలు, క్యాబ్‌లు సైతం ప్రయాణికులపై దోపిడీకి తెగబడ్డాయి. నగరంలో వివిధ రూట్లలో రాకపోకలు సాగించిన సెవన్‌సీటర్‌ ఆటోలు, సాధారణ ఆటో డ్రైవర్లు సైతం ప్రయాణికుల అవసరాన్ని సొమ్ముచేసుకున్నారు. పలు ప్రధాన రూట్లలో స్వల్ప దూరాలకే రెట్టింపు చార్జీలు ముక్కుపిండి మరీ దోచుకున్నారు. క్యాబ్‌ సర్వీసులు సైతం అదనపు శ్లాబు రేట్లు, సర్‌చార్జీల పేరిట నిలువునా ముంచేశాయి. 

ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు కిటకిట 
సమ్మె ప్రభావంతో  నగరంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు కిక్కిరిశాయి. సోమవారం 125 సర్వీసుల్లో సుమారు 1.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు.. ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. సుమారు వంద అదనపు సర్వీసులను నడిపినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఈ సర్వీసుల్లో సోమవారం సుమారు 3 లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపారు. పండగకు మెజార్టీ సిటీజన్లు పల్లెబాట పట్టడంతో మెట్రో రద్దీ కాస్త తగ్గింది.  

దూరప్రాంత రైళ్లు బిజీబిజీ.. 
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లిన 80 ఎక్స్‌ప్రెస్‌.. మరో 100 ప్యాసింజర్‌ రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లలో సీట్లు, బెర్తులు దొరక్క నానా అవస్థలు పడ్డారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రైళ్లలో నానా ఇబ్బందులు పడ్డారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top