పోరుబాటలో ప్రైవేటు విద్యా సంస్థలు

ఈ నెల 29న గౌరెల్లిలో ఆత్మగౌరవ సభ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థ లు తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు మళ్లీ పోరుబాట పట్టాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ సమస్యల పరిష్కారం, డిమాండ్లను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయి. తద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని భావిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీగా ఏర్పాటైన యాజమాన్య సంఘాలు ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టాయి.

నగర సమీపంలోని గౌరెల్లిలో తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి (కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ) ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ఆర్‌.కృష్ణయ్య తదితరులు పాల్గొంటారని పేర్కొంది.  

3 వేల పాఠశాలలు మూతపడ్డాయి
విద్యనే సామాజిక మార్పునకు ఏకైక సాధనం అన్న ఆలోచనతో విద్యారంగ వ్యాప్తికి కృషిచేస్తున్న తమను ప్రభుత్వం ఇబ్బందులపాలు చేస్తూ కార్పొరేట్‌ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోందని జేఏసీ చైర్మన్‌ రమణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికే 3 వేల సాధారణ పాఠశాలలు, 600 జూనియర్‌ కాలేజీలు, 300 డిగ్రీ కాలేజీలు, వందల్లో ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూత పడ్డాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధన కోసమే తాము ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top