తపాలా..సేవలు భళా

తపాలా..సేవలు భళా - Sakshi


పోస్టాఫీసులంటే ఒకప్పుడు ఉత్తరాల బట్వాడాకే పరిమితం. మరిప్పుడో... బ్యాంకుల్లోలా డబ్బులు వేయొచ్చు.. తీయొచ్చు. వేరే ఊరికి డబ్బులు పంపొచ్చు. ఏటీఎం సేవలూ లభ్యం. తపాలా సేవలతో అతితక్కువ ఖర్చుతో ఇల్లు మారొచ్చు.  రైల్వే రిజర్వేషన్ సౌకర్యం, బీమా సేవలు... వీటితో పాటు మీకో చక్కటి వరం తిరుపతి వెంకన్న స్వామి అక్షింతలతో ‘ఆశీర్వచనం’ సేవలు. ‘మై స్టాంప్’ సేవల కింద మీ ఫొటోలతోనే స్టాంపులు మీకు లభ్యం. నిన్నమొన్నటి వరకు కొన్ని రకాల సేవలకే పరిమితమైన తపాలా శాఖ ప్రస్తుతం తలుపులు బార్లా తెరిచి బహుముఖంగా తన సేవలను విస్తరించింది. తపాలా శాఖ ప్రస్తుతం ఏయే సేవలు... ఎలా అందిస్తోంది తదితర వివరాలు మీకోసం...    

 

ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్

ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు.

 

ఆశీర్వచనం

ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫొటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు.

 

సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు.

 

లాజిస్టిక్ పోస్టు

ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్‌షిఫ్టింగ్‌కు కూడా వినియోగించుకోచ్చు. ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు.

 

రైల్వే రిజర్వేషన్ సౌకర్యం

ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది.

 

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్

జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికీ ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top