
'మెడికల్ సీట్లు విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు'
తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ సీట్లను విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ సీట్లను విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో పొంగులేటి సుధాకర్రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ సర్కార్ చోద్యం చూస్తోందని విమర్శించారు. మెడికల్ బి కేటగిరి సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉందని సదరు శాఖ మంత్రికి తెలియకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
సీట్ల అమ్మకంపై తెరవెనుక ఏదో బాగోతం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పెద్దలు ఈ వ్యవహారంలో కుమ్మక్కాయారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లపై నియంత్రణ ఉండాలని... ప్రభుత్వమే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని పొంగులేటి సుధాకర్రెడ్డి కేసీఆర్ సర్కార్ను డిమాండ్ చేశారు.