
దంపతులను ఆశీర్వదిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టివిక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ పోట్ల
ఖమ్మం: మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి వివాహం ఈ నెల 26న సోమరెడ్డితో జరగగా ఆదివారం వివాహనంతరం ఆశీర్వచన మహోత్సవాన్ని ఖమ్మంలో ఎస్‌ఆర్ గార్డెన్స్ వద్ద నిర్వహించారు. భారీ బాహుబలి సెట్టింగుల నడుమ నిర్వహించిన ఈ మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు, అభిమానులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్, టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి వేడుకకు హాజరై దంపతులను ఆశీర్వదించారు.
రిసెప్షన్‌కు హాజరైన అభిమానులకు అభివాదం చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు
ఈ సందర్భంగా పొంగులేటి ఏర్పాటు చేసిన విందుకు హాజరై భోజనం చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన వేడుక సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. పొంగులేటి అభిమానులు భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతం అంతా జనసంద్రంగా మారింది. దంపతులను ఆశీర్వదించేందుకు ఏర్పాటు చేసిన వేదిక ఎంతో ఆకట్టుకుంది. పూరి జగన్నాథ క్షేత్రం తరహాలో వేదికను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, లావుడ్యా రాములునాయక్, మల్లు భట్టివిక్రమార్క, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, నగర మేయర్ పాపాలాల్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నూకల నరేశ్‌రెడ్డి, తాతా మధు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గాయత్రి రవి తదితరులు హాజరయ్యారు.
విందులో భోజనం చేస్తున్న అజయ్‌కుమార్‌ను కౌగిలించుకుంటున్న పొంగులేటి