బదిలీలకు రంగం సిద్ధం 

Police Department Prepare Transfers Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జిల్లాలో మూడేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించడంతో నియమావళి ప్రకారం పలు శాఖల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారుల జాబితాను సిద్ధం చేశారు. ప్రధానంగా వివిధ మండలాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, ఎంపీడీఓలకు స్థానచలనం కలగనుంది. తొలుత ఆయా మండలాల్లో మూడేళ్లు పూర్తి చేసుకున్న వారిని జిల్లాలోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని ఉద్యోగ వర్గాల్లో ఊహాగానాలు వినిపించినా.. మూడేళ్లు పూర్తి చేసుకున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటు రెవెన్యూ.. అటు పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు ఎన్నికల కమిషన్‌ నియమావళికి అనుగుణంగా బదిలీలకు అర్హులు ఎంత మంది అనే అంశాన్ని తేల్చి.. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు.

బదిలీకి అర్హత ఉన్న ఎంపీడీఓల జాబితాను ఇప్పటికే జిల్లా పరిషత్‌ అధికారులు.. పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌కు పంపించినట్లు సమాచారం. అలాగే జిల్లాలోని వివిధ మండలాల్లో తహసీల్దార్లుగా పనిచేస్తున్న వారి జాబితాను సైతం జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన సమయంలో ఈ తరహా బదిలీలు అధికారులకు సర్వసాధారణమని, గత ఎన్నికల సమయంలోనూ జిల్లాలోని పోలీస్‌ అధికారులతో సహా అనేక మంది అధికారులకు ఇతర జిల్లాలకు బదిలీలు అయ్యాయని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే పోలీస్‌ శాఖ చేపట్టిన బదిలీల్లో జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీఐ స్థాయి అధికారులకు స్థానచలనం కలిగింది. మరికొద్ది రోజుల్లో ఎక్కువ కాలంగా పనిచేస్తున్న ఎస్సై స్థాయి అధికారులకు సైతం స్థానచలనం కలిగించేందుకు పోలీస్‌ శాఖ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధాలున్న పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్‌ అధికారులనే ఎన్నికల సమయంలో బదిలీ చేస్తుండగా.. ఈసారి పోలీస్‌ శాఖలోని ఆర్ముడ్‌ రిజర్వు విభాగంలోని ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి పైస్థాయి అధికారులకు సైతం స్థానచలనం కలిగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పోలీస్‌ శాఖలోని ఏఆర్‌ విభాగానికి ఎన్నికల బదిలీలు వర్తించడం తొలిసారి కావడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు.. తహసీల్దార్లుగా వ్యవహరిస్తున్నారు. వారిని సైతం బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 40 మంది తహసీల్దార్లకు, 35 నుంచి 40 మంది ఎంపీడీఓలకు స్థానచలనం కలగనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిని ఏ జిల్లాకు కేటాయిస్తారన్న అంశం ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top