పీజీ ప్రవేశ పరీక్షలు ఇక ఆన్‌లైన్‌లోనే.. 

PG Entrance Exams Online - Sakshi

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పరీక్షల నిర్వహణ బాధ్యత  

టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంట్రెన్స్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ పీజీ ఎంట్రెన్స్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగిస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. శనివారం టీఎస్‌సీహెచ్‌ఈ కార్యాలయంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లతో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే పీజీ ప్రవేశాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపుల్లో కోర్సుల వారీగా రిజర్వేషన్ల విధానాన్ని పాటిస్తామన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన విశ్వవిద్యాలయానికి యంగ్‌ యూనివర్సిటీ అవార్డు, ఉత్తమ పరిశోధన చేసిన అధ్యాపకులకు 12 మందికి అవార్డులు ఇస్తామని ప్రకటించారు. అధ్యాపకులకు ఏటా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై విద్యార్థుల నుంచి ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలని, ఇందుకు ఫీజులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని సూచించారు.  

జూన్‌ 25 నుంచి డిగ్రీ తరగతులు 
2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను జూన్‌ 25 నుంచి ప్రారంభిస్తామని పాపిరెడ్డి తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top