కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ | permission granted for kothagudem-sathupally railway line | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Mar 29 2017 3:30 AM | Updated on Sep 2 2018 4:16 PM

కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ - Sakshi

కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

కొత్తగూడెం-సత్తుపల్లి బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు పూర్తి అనుమతులు జారీ చేసింది.

- నిర్మాణ వ్యయాన్ని భరించనున్న సింగరేణి
- రూ.704 కోట్లు వెచ్చించేందుకు అంగీకారం
- భూసేకరణ వ్యయం బాధ్యత రైల్వేదే.. త్వరలోనే  పనులు


సాక్షి, హైదరాబాద్‌:
కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వేలైన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు మంగళవారం లేఖ అందింది. సింగరేణి సంస్థ చొరవతో ఈ లైన్‌ నిర్మాణం కాబోతోంది. కొత్తగూడెం–సత్తుపల్లి–కొవ్వూరు మధ్య 134 కిలోమీటర్ల మార్గంలో భాగంగా తొలుత కొత్తగూడెం–సత్తుపల్లి(53.20 కి.మీ.) మార్గాన్ని నిర్మిస్తారు. దీనికి అంచనా వ్యయాన్ని రూ.704.31 కోట్లుగా ఖరారు చేశారు. ఈ మొత్తం వ్యయాన్ని సింగరేణి సంస్థనే భరించనుంది. భూసేకరణ వ్యయాన్ని మాత్రం రైల్వే శాఖ భరిస్తుంది.

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వేశాఖ స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేసుకుని ముఖ్యమైన ప్రాజెక్టులను 50:50 భాగస్వామ్య వ్యయంతో చేపడుతోంది. కానీ ఇక్కడ సాధారణ ప్రయాణికుల కంటే సింగరేణి అవసమే ఎక్కువగా ఉండటంతో పూర్తి వ్యయాన్ని (భూసేకరణ మినహా) సంస్థనే భరించేందుకు ముందుకొచ్చింది. ఈ లైన్‌కు అనుమతి లభించడంపై సింగరేణి సంస్థ హర్షం వ్యక్తం చేసింది. రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయితే సత్తుపల్లి గనుల నుంచి బొగ్గు రవాణాసురక్షితంగా, పర్యావరణ హితంగా జరిపే వీలు కలుగుతుందని పేర్కొంది.

రైల్వేలైన్‌తో తగ్గనున్న సమస్యలు
సింగరేణి సంస్థ కొత్తగూడెంకు 55 కి.మీ. దూరంలోని సత్తుపల్లిలో బొగ్గు గనులు నిర్వహిస్తోంది. సత్తుపల్లిలోని జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌ గనుల నుంచి రోజూ 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. భవిష్యత్తులో ఏడాదికి కోటి టన్నుల బొగ్గు ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బొగ్గును పాల్వంచలోని కేటీపీఎస్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి సరఫరా చేస్తుండగా, భవిష్యత్తులో ప్రతిపాదిత మణుగూరు, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సైతం ఇక్కడ్నుంచే సరఫరా చేయనున్నారు. లారీల ద్వారా రోడ్డు మార్గంలో పెద్దఎత్తున బొగ్గు సరఫరా చేస్తే పర్యావరణ, రక్షణ సమస్యలతోపాటు ఇతర సమస్యలు పెరగనున్నాయి.

ఈ నేపథ్యంలో రైల్వే మార్గంలో బొగ్గు రవాణా జరపాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. సత్తుపల్లి వరకు రైల్వే లైన్‌ను విస్తరించాలని చాలాకాలంగా కోరుతోంది. ప్రయాణికులకు కూడా ఈ లైన్‌ నిర్మాణం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నిర్మాణ వ్యయాన్ని భరిస్తే వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధమని ఇటీవల రైల్వే శాఖ ప్రతిపాదించటంతో సింగరేణి అంగీకరించింది. రెండు సంస్థల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. దీంతో కేంద్ర బడ్జెట్‌లో ఈ మార్గానికి చోటు దక్కింది. రూ.300 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్టు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. పనులు చేట్టేందుకు రైల్వే బోర్డు అమోదం తెలుపుతూ దక్షిణ మధ్య రైల్వేకు సమాచారం అందించడంతో త్వరలోనే భూసేకరణ పనులు మొదలు కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement