అస్తవ్యస్తం.. ఆర్టీసీ ప్రయాణం

People facing Trouble In RTC Journey By Bus Strikes In Karimnagar - Sakshi

సాక్షి, గోదావరిఖనిటౌన్‌(రామగుండం)/ మంథని : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రయాణికుల పాలిట దినదిన గండంగా మారింది. పండక్కి వచ్చినవారు.. విద్యార్థులు బస్సులో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా బస్సు టికెట్లు రిజర్వేషన్‌ చేయించుకున్నప్పటికీ సమ్మె కారణంగా అధికారులు వారి సొమ్మును తిరిగిచ్చేశారు. దీంతో చాలా మంది సెలవుల అనంతరం దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయివేటు వాహనాలను ఆశ్రయించి జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. గోదావరిఖని నుంచి చాలా మంది హైదరాబాద్, బెంగళూరు.. తదితర దూరప్రాంతాల్లో స్థిరపడినవారున్నారు. పండక్కి వచ్చినవారు పెద్దమొత్తంలో వెచ్చించి తిరుగుపయనమవుతున్నారు. గోదావరిఖని నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే రూ.250 ఉండగా.. ఇప్పుడు రూ.400 వసూలు చేస్తున్నట్లు వాపోతున్నారు. మరికొందరు ప్రయివేటు ఆపరేటర్లు రూ.600 సైతం తీసుకుంటున్నారని చెబుతున్నారు. 

బస్సుపాసుల పరిస్థితి మరీ దారుణం
విద్యార్థులు, ఉద్యోగులు, వికలాంగుల పాసులు పనిచేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 1600మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండువేల మంది రెన్యువల్‌ చేసుకోవాల్సినవారున్నారు. ఈ నెల 13న విద్యాసంస్థలకు సెలవులు ముగుస్తుండడంతో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం బస్‌పాసులను అంగీకరించాలని ఆర్టీసీకి సూచించినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక రాయితీ టిక్కెట్, క్యాట్‌కార్డు, వనితకార్డు, ఫ్రీకార్డులను సైతం అంగీకరించడం లేదు.  

పల్లెకు వెళ్లని బస్సు..
దసరా పండుగకు సొంతూర్లకు వచ్చిన వారంతా తిరుగు పయణమవుతున్నారు. దీంతో మంథని బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. డిపో నుంచి గురువారం 38 ఆర్టీసీ, 12 అద్దెబస్సులు నడిపించారు. అయితే హైదరాబాద్, కరీంనగర్, గోదావరిఖని, భూపాలపల్లి రూట్లలోనే నడిపించారు. దీంతో పల్లెలకు వెళ్లాల్సినవారు.. అక్కడి నుంచి రావాల్సినవారు ఇబ్బంది పడ్డారు. అధికచార్జీలు వసూలు చేయకుండా డిపోపరిధిలోని బస్సులకు చార్జివివరాల షీట్లను అతికించారు. ఫిర్యాదులుంటే డిపో మేనేజర్‌ 9959225923, కంట్రోల్‌ రూం 8728297555 కుసంప్రదించాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top