
సాక్షి, సిటీబ్యూరో: అల్వాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా నగరంలోని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆవరణలో మూడు నెలల పాటు పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. సదరు కేంద్ర ప్రభుత్వ సంస్థలోకి నిత్యం రాకపోకలు సాగించేందుకు ధ్రువీకరణపత్రాలు అవసరమని సిబ్బంది స్పష్టం చేశారు. అతడి నేపథ్యంపై పోలీసుల నుంచి ధ్రువీకరణ తీసుకురావాలని సూచించారు. దీంతో అతను 15 రోజుల క్రితం అల్వాల్‌లోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకున్నాడు. అయితే పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీలో జాప్యం జరిగింది. అతనొక్కడికే కాదు...వందలాది మందికి రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో తరచూ ఎదురవుతున్న అనుభవాలివి. పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ అవసరం పడినా, ఏదైనా పొగొట్టుకొని డూప్లికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిన క్రమంలో పోలీసులను సంప్రదిస్తే వాటిని తిరస్కరిస్తున్నారు. అయితే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో లాస్ రిపోర్టు పేరిట బాధితులకు సాంత్వన చేకూర్చే ప్రయత్నం జరుగుతు న్నా ఈ రెండు కమిషనరేట్లలో ఆ తరహా స్పందన కరవైందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
సకాలంలో అందక కష్టాలు...
ఏదైనా పని కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీ సేవ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 322 రకాల పౌరసేవలను పొందే అవకాశాన్ని కల్పించిన ఈ కేంద్రంలో పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్‌తో పాటు వస్తువులన్నీ పొగొట్టుకున్నందుకు ధ్రువీకరణపత్రాలను ఇచ్చే సేవలను కూడా చేర్చారు. క్షేత్రస్థాయిలో...ముఖ్యంగా> పోలీసులపరంగా మాత్రం పలు సందర్భాల్లో బాధితులకు తిరస్కరణలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రస్తుతం తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ల అవసరం ఏర్పడుతోంది. అభ్యర్థుల నేపథ్యం, ప్రవర్తనపై పోలీసులు విచారణ జరిపి నిరంభ్యంతర పత్రం ఇస్తేనే ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమవుతోంది. అలాగే ఏదైనా ధ్రువీకరణ పత్రం పొగొట్టుకున్నప్పుడు పోలీసులు ధ్రువీకరిస్తేనే డూప్లికేట్ పొందడం సాధ్యమవుతుంది. కానీ ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో బాధితులకు తరచూ ఇబ్బందులు తప్పడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసి పోలీసు సర్టిఫికెట్ తీసుకోవాల్సిన సమయంలో ఆలస్యమవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్లకు వెళుతున్నట్లు, మరికొన్ని సందర్భాల్లో పోలీసు కమిషనరేట్‌కు వెళుతున్నట్టు చూపెడుతుండటంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దరఖాస్తుదారుల ప్రవర్తనపై స్థానిక పోలీసు స్టేషన్‌లలో ధ్రువీకరణపత్రాలు ఇవ్వొద్దని ఇప్పటికే కమిషనర్లు మెమోలు కూడా జారీ చేయడంతో దరఖాస్తుదారులను కమిషనరేట్‌లకే స్థానిక పోలీసులు పంపిస్తున్నారు.
లాస్ రిపోర్టుతో త్వరగా సేవలు...
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కమిషనరేట్ వెబ్‌సైట్‌లో లాస్ రిపోర్టు సదుపాయం కల్పించారు. బాధితులు ధ్రువీకరణపత్రాలు గానీ, సెల్‌ఫోన్లను పొగొట్టుకుంటే ఠాణాకు గానీ, మీసేవ కేంద్రాలకు గానీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెబ్‌సైట్‌లో లాస్‌రిపోర్టు అప్షన్‌కు వెళ్లి యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్‌లోనే పొగొట్టుకున్న ధ్రువీకరణపత్రాలు,, సెల్‌ఫోన్లపై ఫిర్యాదు చేస్తే చాలు వెతికిపెట్టే పనిని పోలీసులే చూస్తున్నారు. ఇలా చేసిన ఫిర్యాదులకు సంబంధించిన ధ్రు వీకరణ పత్రాలను 72 గంటల్లోగా తిరిగి సెల్‌కే పంపిస్తుండడంతో బాధితులకు ఊరట లభిస్తోంది.