ప్లాస్టిక్‌ లైసెన్స్‌ రూల్స్‌ అమలు బాధ్యత మున్సిపల్‌ శాఖదే

PCB appealed to the High Court about Plastic License Rules implementation  - Sakshi

హైకోర్టుకు విన్నవించిన పీసీబీ  

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణానికి ముప్పు కలిగించే 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువులు, షీట్లు, ఫిలిమ్స్‌ వంటి వాటిని తయారీ స్థాయిలోనే ఉత్పత్తి కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జీవో 79 జారీ చేశామని, దీనిని తొలిసారి ఉల్లంఘించిన ఉత్పత్తిదారులకు రూ.50 వేలు, రెండోసారి అదే తప్పు చేస్తే ఉత్పత్తికిచ్చిన అనుమతులను రద్దు చేస్తామని తెలిపింది. లైసెన్స్‌ మంజూరుకు విధించిన కఠిన నిబంధనల్ని అమలు చేసే బాధ్యత మాత్రం మున్సిపల్‌ శాఖదేనని పీసీబీ సభ్య కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో పేర్కొంది.

వినాయక విగ్రహాలకు నిషిద్ధ ప్లాస్టిక్‌ కవర్లు కప్పుతున్నారని, వీటి వల్ల పర్యావరణానికి ముప్పు రాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఎల్బీనగర్‌కు చెందిన వైవీ మురళీకృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈ కౌంటర్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిల్‌ దాఖలు తర్వాత ఎల్బీనగర్, బోయినపల్లి, సుచిత్ర, గండిమైసమ్మ క్రాస్‌ రోడ్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకూ, కొంపల్లి, మియాపూర్, ఉప్పల్, నాగోలు వంటి ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వర్షానికి తడవకుండా కప్పిన ప్లాస్టిక్‌ కవర్లను తొలగించామని, వాటిని పరీక్షలకు పంపామన్నారు.

40 తయారీ సంస్థలపై తనిఖీలు నిర్వహిస్తే ఎనిమిది చోట్లే ప్రమాణాలకు విరుద్ధంగా ఉత్పత్తి అవుతున్నట్లుగా గుర్తించి రూ.50 వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు యూనిట్లను మూసివేశామని, షాపుల నుంచి రూ.32 లక్షలకుపైగా జరిమానా వసూలు చేశామని తెలిపారు. ఈ పిల్‌ను హైకోర్టు విచారించనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top