డ్యూటీ వెసులుబాట్లపై వేటు

Ownership Of RTC Cancel Relief For Labor Leaders - Sakshi

కార్మిక నేతలకు రిలీఫ్‌లు రద్దు చేసిన ఆర్టీసీ యాజమాన్యం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెతో కార్మిక సంఘాల నేతలపై రగిలిపోతున్న అధికారులు వారికున్న వెసులుబాట్లపై వేటు వేస్తున్నారు. గుర్తింపు కార్మిక సం ఘం నేతలకు ప్రత్యేక రిలీఫ్‌లు పొందే వెసులుబాటు ఉంది. రిలీఫ్‌ అంటే.. వారు విధులకు హాజరు కావాల్సిన పనిలేదు. హాజరుపట్టికలో సంతకం చేస్తే చాలు వేతనం అందుతుంది. ఇలాంటి వాటిని తొలగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. వాటికి సంబంధించిన వారందరికీ, ఆయా వెసులుబాట్లు తొలగిస్తున్నట్లు అధికారులు 300 మందికి శ్రీముఖాలు పంపినట్లు తెలిసింది. గత కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ విజయం సాధించింది.

దీంతో ఈ సంఘం గుర్తింపు సంఘంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నేతల్లో 20 మందికి పూర్తి రిలీఫ్‌లు ఉంటాయి. వీరు ఒక్క రోజు కూడా విధులకు హాజరు కావాల్సిన పనిలేదు. ఇక ప్రతి డిపో కార్యదర్శికి యూనియన్‌ రిలీఫ్‌ పేరుతో వారానికి ఒక రోజు, రీజినల్‌ కార్యదర్శికి వారానికి ఒక రోజు ఉంటుంది. గుర్తింపు సంఘానికి సంబంధించి తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో పర్యవేక్షణకు నిత్యం ఆఫ్‌ డే రిలీఫ్‌ ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటిని రద్దు చేస్తున్నట్లు అధికారులు వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.

మీడియాపై ఆంక్షలు..
బస్‌భవన్‌లోకి మీడియా ప్రతినిధులు రాకుండా అనధికార ఆంక్షలు విధించారు. విలేకరులను లోనికి రానీయవద్దని అధికారులు ఆదేశించారని ప్రధాన గేటు వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.

రూ.3 వేల కోట్లివ్వండి.. 
ఆర్టీసీకి వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.3 వేల కోట్లు ఇస్తే సమస్యలన్నీ పోతాయని, భవిష్యత్‌లో నష్టాల మాట లేకుండా సంస్థ నడుస్తుందని కార్మిక సంఘం సీనియర్‌ నేత, ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు అన్నారు. ఈ దిశగా ఆలోచించాలని కోరుతూ  సీఎం కార్యాలయానికి కూడా లేఖ రాసినట్టు తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆదివారం మానవహారాలు నిర్వహించనున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌కు, చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పించి అన్ని డిపోల పరిధిలో మానవహారాలు నిర్వహించాలని శనివారం జరిగిన సమావేశంలో జేఏసీ నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top