సర్కార్ ఇస్కూల్ | Outside of school children should be in school | Sakshi
Sakshi News home page

సర్కార్ ఇస్కూల్

Jun 13 2014 11:32 PM | Updated on Sep 2 2017 8:45 AM

సర్కార్ ఇస్కూల్

సర్కార్ ఇస్కూల్

బడి బయటి పిల్లలు పాఠశాలలో ఉండాలి.. నాణ్యమైన బోధన.. ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని వసతులు.. మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ప్రభుత్వ పాఠశాలల గురించి అధికారులు, పాలకులు చెప్పే మాటలు.

పైన పోటువల గనిపిస్తున్నది మన మెతుకు సీమలోని ఓ బడి.. నాలుగు కట్టెలు.. సుట్టూ కొన్ని పుల్లలు.. పైన ఎండిన గడ్డి.. కింద ఇసుక.. గిదేం ఇస్కూల్ అంటర.. గిది ఇస్కూలే..15 ఏండ్ల సంది గిట్లనే నడుస్తున్న సర్కార్ ఇస్కూల్.. ఈ బల్లోనే 25 మంది పోరగాండ్లు అచ్చరాలు దిద్దుతుండ్రు.. గాలొచ్చినా.. వానొచ్చినా ఏడ కూల్తదోనని భయపడుతుండ్రు..మరి గింత ఘోరమా.. బంగారు తెలంగాణలో గూడా గిట్లాంటి బడులా..గింతకీ ఈ ఇస్కూల్ ఏడుందంటరా..లోపల పేజీల్ల సదువుండ్రి...అడగాల్సినోళ్లను అడుగుండ్రి...మా పిళ్లగాండ్లకు సక్కని బడులు గట్టించేంతవరకు లొల్లిజేస్తమని గట్టిగ జెప్పుండ్రి.. మర్సిపోయినం సీఎం సాబ్ మనోడే గదా.. సూద్దాం ఏం జేస్తడో
 
 కౌడిపల్లి: బడి బయటి పిల్లలు పాఠశాలలో ఉండాలి.. నాణ్యమైన బోధన.. ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని వసతులు.. మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ప్రభుత్వ పాఠశాలల గురించి అధికారులు, పాలకులు చెప్పే మాటలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ పంచాయతీ కొర్ర సీత్యతండా 35 కుటుంబాలు ఉన్నాయి.
 
 తండావాసుల కోరిక మేరకు ఇక్కడ 15 ఏళ్ల క్రితం అధికారులు ఓ పూరి గుడిసెలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ పూరి గుడిసెలోనే పాఠశాల కొనసాగుతోంది. ఒక్కో ఏడాది 15 నుంచి 25 మంది వరకు ఈ పూరిగుడిసెలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. చాలాసార్లు తనిఖీ చేసేందుకు ఇక్కడికొచ్చిన అధికారులు పక్కా భవనం మంజూరు చేస్తామంటూ హామీలిచ్చారు. కానీ అది ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇదిలావుంటే మూడేళ్ల క్రితం పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ పాఠశాలను కూడా మరోపాఠశాలలో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు ఇక్కడి నుంచి కాలినడకన మరోచోట ఉన్న పాఠశాలకు వెళ్లి విద్యాభ్యాసం కొనసాగించేవారు. వర్షాకాలంలో కాలినడకన అంతదూరం వెళ్లడం ఇబ్బందిగా మారడంతో చాలా మంది చదువులకు స్వస్తి చెప్పారు. దీంతో తండావాసులంతా అధికారులకు మొరపెట్టుకోగా, రెండేళ్ల క్రితం కొర్ర సీత్యతండాలో పాఠశాలను తిరిగి ప్రారంభించారు.
 
 అయితే కూలేందుకు సిద్ధంగా ఉన్న పూరిపాకలోనే మళ్లీ పాఠశాల కొనసాగించారు. గతంలో ఈ పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయుడు ఉండగా, విలీనం తర్వాత ఉపాధ్యాయుడూ కరువయ్యాడు. దీంతో రెండేళ్లుగా విద్యావలంటీర్లే ఇక్కడి విద్యార్థులకు చదువులు చెప్పారు. అయితే ఈ విద్యాసంవత్సరం విద్యావాలంటీర్ల నియమించని అధికారులు దయ్యలతండా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను డిప్యూటేషన్‌పై ఇక్కడికి పంపారు.
 
 ప్రస్తుతం పాఠశాలలో 12 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పూరిగుడిసెలో బిక్కుబిక్కుమంటూ భవిష్యత్‌ను దిద్దుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామంలోని పాఠశాలకు పక్కా భవనం మంజూరు చేయడంతో పాటు రెగ్యులర్ ఉపాధ్యాయున్ని నియమించాలని తండావాసులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓ రాజారెడ్డిని వివరణ కోరగా పాఠశాలకు పక్కా భవనంతో పాటు ఉపాధ్యాయుడిని కేటాయించాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement